మా దేవుళ్లను అవమానిస్తే ఊరుకోం..కూసుంటే లేవలేనోళ్లు పదేండ్లలో ఏం చేసినరో చెప్పాలె : మంత్రి సీతక్క

మా దేవుళ్లను అవమానిస్తే ఊరుకోం..కూసుంటే లేవలేనోళ్లు పదేండ్లలో ఏం చేసినరో చెప్పాలె : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ‘ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా అస్తిత్వానికి సజీవ సాక్షాలుగా చరిత్రలో నిలువాలని శిలలపై తల్లుల చిత్రాలు చెక్కితే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు.. కూర్చుంటే లేవలేనోళ్లు.. లేస్తే కూర్చోరానోళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు’ అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ములుగులోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాటు ఇన్‌‌చార్జి మంత్రిగా పనిచేసినా ఏమీ చేయలేని వారు.. ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇన్నేండ్లలో ఒక్క గిరిజన తండా, గూడేనికి వెళ్లని వారు ఇప్పుడు శివారు గ్రామాలకు వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం పేదలకు రేషన్‌‌ కార్డులు, బియ్యం ఇస్తుంటే కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌‌కు పంపితే... కేంద్రం వద్ద పెండింగ్‌‌లో పెట్టారని మండిపడ్డారు. 

ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో అభివృద్ధి పనులు చేస్తుంటే.. బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు అడ్డు పడుతున్నారన్నారు. గతంలో అమ్మేసిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ హాస్పిటల్‌‌కే కేటాయిస్తామని స్పష్టం చేశారు. ములుగు నియోజకవర్గంలో 105 సర్పంచ్‌‌ స్థానాలకు.. 85 స్థానాలను కాంగ్రెస్ పార్టే గెలుచుకుందని, కష్టపడి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 ఏటూరునాగారం జనరల్ స్థానంలో కూడా బీసీని నిలబెట్టామని, వారి కోసం ప్రచారం చేయడం బాధ్యతగా భావించానని, దానిని కూడా వక్రీకరించడం దుర్మార్గపు చర్య అన్నారు.ఆదివాసి బిడ్డ మంత్రిగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే.. మల్లంపల్లిని ప్రత్యేక మండలం చేశామని, ఢిల్లీలో మాట్లాడి మెడికల్ కాలేజీ సైతం సాధించుకున్నామన్నారు. మేడారం తల్లుల విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్‌‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ బానోతు రవిచందర్, బీసీ సెల్‌‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ బొక్క సత్తిరెడ్డి పాల్గొన్నారు.