- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని
వనపర్తి టౌన్, వెలుగు : బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని సూచించారు. మంగళవారం వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలకు సహకరించిన ప్రతి ఒక్కరూ శిక్ష అర్హులు అవుతారని తెలిపారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి పోక్సో చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. పదో తరగతి విద్యార్థులు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఒత్తిడికి గురవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తెలిపారు. కార్యక్రమంలో రఘు, నూర్జాన్ తదితరులు పాల్గొన్నారు.
