‘కోర్ట్’లో మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. ‘దండోరా’ చిత్రంలోని తన పాత్రకు అంతే ఆదరణ దక్కుతుందని నటుడు శివాజీ చెప్పాడు. ఈ చిత్రంలో తనతోపాటు నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల ముఖ్య పాత్రలు పోషించారు. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘కోర్ట్’ కంటే ముందే ఈ కథ విన్నాను. కానీ ప్రొడక్షన్ పరంగా ఆలస్యమై ‘కోర్ట్’ ముందుగా రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రంలో నా క్యారెక్టర్ మంచోడా, చెడ్డోడా అని చూసే ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తా. అయితే అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి.
అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాగని పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన చిత్రమిది. ఎంతో సహజంగా ఉంటుంది. బిందు మాధవి, నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక నేను నటిస్తూ నిర్మిస్తున్న ‘సుప్పిని సుద్దపూసని’ చిత్రం త్వరలో రాబోతోంది. అలాగే ఆదిత్య హాసన్ తీస్తున్న ‘ఎపిక్’ చిత్రంలో నటిస్తున్నా’ అని చెప్పాడు.
