కేంద్రం నుంచి వస్తేనే.. యూరియా కొరత తీరేది : తుమ్మల నాగేశ్వర్ రావు

కేంద్రం నుంచి వస్తేనే.. యూరియా కొరత తీరేది : తుమ్మల నాగేశ్వర్ రావు

 

  • రాష్ట్రానికి 6.60 లక్షల టన్నులకుగాను 4.23 లక్షల టన్నులే సరఫరా  
  • ఏప్రిల్ నుంచి ప్రతి నెలా కోటాలో కొంత మేరకు కోతలు 
  • ఇంకా 2.37 లక్షల టన్నుల యూరియా లోటు 
  • ఆగస్టు కేటాయింపులు 3 లక్షల టన్నులు 
  • ఇవన్నీ వస్తేనే కొరత తీరే అవకాశం 
  • కేంద్ర మంత్రి నడ్డాకు మరోసారి లేఖ రాశాం: మంత్రి తుమ్మల  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా సరఫరాకు భారీ కొరత ఏర్పడింది. కేంద్రం నుంచి యూరియా వస్తేనే కొరత తీరే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 2025 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌ కింద తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. అయితే, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 5 లక్షల టన్నుల వరకు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. దీంతో1.93 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. దీనికి తోడు ఈ జులై నెలలో 1.60 లక్షల టన్నుల కేటాయింపులకు గాను ఇప్పటివరకు1.16 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందింది. ఈ నెలకు సంబంధించి ఇంకా 44 వేల టన్నులు రావాల్సి ఉంది. ఇలా మొత్తంగా చూస్తే కేంద్రం 6.60 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.23 లక్షల టన్నులు మాత్రమే అందించింది. దీంతో ఇంకా 2.37 లక్షల టన్నుల యూరియా లోటును రాష్ట్రం ఎదుర్కొంటోంది.   

ప్రతి నెలలోనూ కేంద్రం కోతలు.. 

రాష్ట్రానికి కేటాయించిన మొత్తం యూరియా కోటాను కేంద్రం నెలలవారీగా సరఫరా చేయాల్సి ఉంది. కేటాయించిన మేరకు సరఫరా చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత తప్పేదని అధికారులు అంటున్నారు. నెలలవారీగా పరిశీలిస్తే, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 1.70 లక్షల టన్నులు కేటాయించగా 1.21 లక్షల టన్నులు మాత్రమే (29% లోటు) కేంద్రం సరఫరా చేసింది. మే నెలలో 1.60 లక్షల టన్నులకుగాను 88 వేల టన్నులు(45% లోటు) సరఫరా చేసింది. జూన్‌‌‌‌‌‌‌‌ లో 1.70 లక్షల టన్నులకు గాను 98 లక్షల టన్నులు మాత్రమే (42% లోటు) సరఫరా చేసింది. ఇప్పుడు జులై నెలలోనూ1.60 లక్షల టన్నుల కేటాయింపులకు గాను 1.16 లక్షల టన్నులు మాత్రమే (27.50% లోటు) సరఫరా చేసింది. ఇలా మొత్తం 6.60 లక్షల టన్నుల కేటాయింపులకుగాను ఇంకా 2.37 లక్షల టన్నుల యూరియా (36% లోటు) సరఫరా చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్రానికి యూరియా సరఫరా లేక క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇప్పటికే 4.73 లక్షల టన్నుల సేల్స్   

రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం 4.23 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేసింది. కానీ డిమాండ్ భారీగా ఉండడంతో మార్క్​ఫెడ్ వద్ద ఉన్న బఫర్ స్టాక్​ను సైతం రైతులకు విక్రయించారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు 4.73 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఉన్న యూరియా బఫర్ స్టాక్ నిల్వల్లోంచి అదనంగా 50 వేల టన్నులు అమ్మితేనే ఇప్పటివరకు కొంత సమస్య తీరింది. ప్రస్తుతం బఫర్ స్టాక్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వచ్చే ఆగస్టు నెలలో యూరియా వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకు ఏర్పడిన 2.37 లక్షల టన్నుల లోటుతో పాటు ఆగస్టు నెల కేటాయింపులు 3 లక్షల టన్నులను సైతం వేగంగా సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 

రాంచందర్​రావు వ్యాఖ్యలు అర్థరహితం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్​రావు యూరియా సరఫరాపై చేసిన కామెంట్లు అర్థరహితమని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన యూరియా కేటాయింపులు, సరఫరాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 

కేంద్రానికి ఐదు లేఖలు రాశాం 

రాష్ట్రంలో యూరియా కొరతను అధిగమించేందుకు ఇప్పటికే కేంద్రానికి ఐదు సార్లు లేఖలు రాశాం. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు జులై 24న కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో జాయింట్ సెక్రటరీ శివశంకర్ కూడా చర్చించగా.. ఆగస్టులో కేటాయింపులు పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు తాజాగా మరోసారి లేఖ రాశాం. ఆగస్టు నెల కేటాయింపులను త్వరితగతిన సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశాం. అలాగే ఇప్పటివరకు సరఫరాలో కోత పెట్టిన 2.37 లక్షల టన్నుల యూరియాను కూడా ఆగస్టు నెల కేటాయింపులు 3 లక్షల టన్నులతో కలిపి సరఫరా చేయాలని కోరాం.- తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి