నేలకొండపల్లి, వెలుగు: తెలంగాణ రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో డీసీసీబీ నూతన బ్రాంచ్‌ను ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశంలోనే ఏక కాలంలో ఏడాదిలో రూ.25 వేల కోట్లను 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమని, అది సీఎం రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైందన్నారు. గతంలో దేశంలోనే ఎప్పుడూ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్పారు.
దానిని కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు నీటి లభ్యతని బట్టి పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న సంవత్సరం కాలంలో గోదావరి జలాలు పాలేరు నియోజకవర్గానికి అందిస్తామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కొత్త బ్రాంచ్ ఏర్పాటుతో రైతులకు మరింత చేరువగా సహకార బ్యాంకింగ్ సేవలు అందనున్నాయన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకమే, ప్రభుత్వ బలం
ఖమ్మం టౌన్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' విజయవంతం కావడమే నిదర్శనమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి మాట్లాడారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జులై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు.
పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా వర్గీకరించి, 25 నుంచి 30 రోజులుగా 'ప్రజల వద్దకే ప్రభుత్వం' అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఆఖరి విభాగం పూర్తయిందని, ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల మంది ప్రజలను తాను వ్యక్తిగతంగా కలిసి, వారి సమస్యలను విన్నానని పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం 24వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9,26,000 సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండలి నిబంధనలను సవరించిందని తెలిపారు. అర్హులైన అన్ని సాదాబైనామాలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలు తీరుస్తుందనే విశ్వాసం ప్రజల్లో కనిపించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏవైనా సరే ఓటరు స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
