అశ్వారావుపేట: కమీషన్లు రావనే గత సర్కార్ ఇండ్లు కట్టలే

అశ్వారావుపేట: కమీషన్లు రావనే గత సర్కార్ ఇండ్లు కట్టలే
  •     రెండేండ్లలో72 వేల ఉద్యోగాలు ఇచ్చినం
  •     త్వరలో 9 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: గత పాలకులు కమీషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి, పేదలకు ఇండ్లు కట్టివ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలం కట్కూరు, వీరభద్రని గుంపు, పట్వారిగూడెం, మొద్దులగూడెం గ్రామాల్లో లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేయించారు. పట్వారి గూడెంలో  38 మందికి డబుల్  బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అందజేశారు. 

అనంతరం పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్  ప్రభుత్వం రెండేండ్లలో 72 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరో 9 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్  ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా, అభివృద్ధి  కుంటుపడవద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్  స్కూళ్లను మంజూరు చేశామని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఐదెకరాల్లో గ్రౌండ్  ప్లస్  త్రీ బిల్డింగ్​లు కట్టించి పేదలకు అందిస్తామని చెప్పారు. కలెక్టర్  అంకిత్, లైబ్రరీ చైర్మన్  పసుపులేటి వీరబాబు, మున్సిపల్​ చైర్​పర్సన్  జూపల్లి శశికళ పాల్గొన్నారు.