ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

 ఖమ్మం, వెలుగు :  ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం 3వ డివిజన్ లో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ లో విలీన గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించి ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువ గల పనులు మంజూరు చేశామన్నారు. 

మరో రూ.150 కోట్లు  మంజూరు చేయాల్సిందిగా సీఎంకు  ప్రతిపాదనలు పంపానని చెప్పారు. ఆగస్టు 15 నాటికి కనీసం మరో రూ.100 కోట్లు ఖమ్మం నగరానికి ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఖమ్మం నగరంలో రూ. 280 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రూ.160 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

ఖమ్మం నగరంలో భూ గర్భ డ్రైనేజీ కోసం రూ.200 కోట్ల మంజూరు చేశామని, నగరంలో మరో రూ.220 కోట్లు అమృత్ నిధులు తీసుకొని వచ్చి తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు  పాల్గొన్నారు