- రాష్ట్రానికే మోడల్ గా నిలపాలని మంత్రి తుమ్మల ప్లాన్
- సంక్రాంతికి అందుబాటులోకి తేవాలని నిర్ణయం
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో కొత్త మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాత మార్కెట్ స్థానంలోనే షెడ్లను కూల్చివేసి, రూ.155.45 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఆధునిక వసతులతో కొత్తగా మార్కెట్ ను నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం కావడంతో, రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా దీన్ని తీర్చిదిద్దాలని ఆయన ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మొత్తం 6 ట్రాన్సాక్షన్ షెడ్లు నిర్మిస్తున్నారు.
ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్ టెక్నాలజీతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 5వ షెడ్ లో పీసీసీ కాంక్రీట్, రూఫ్ షీటింగ్ ఇప్పటికే పూర్తయింది. 4 షెడ్లో పీసీసీ కాంక్రీట్ పూర్తి కాగా, కాలమ్స్ బిగించారు. 3 వ షెడ్ లో కాలమ్స్ బిగించగా, గ్రావెల్ ఫిల్లింగ్ పూర్తయింది. వచ్చే వారం కాంక్రీట్ చేయనున్నారు. రైతు పండుగగా భావించే సంక్రాంతి నాటికి కొత్త వ్యవసాయ మార్కెట్ ను పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
ఖమ్మం మార్కెట్ కు ఘనమైన చరిత్ర
రాష్ట్రంలో మిర్చి పంటకు ఖమ్మం మార్కెట్ ఫేమస్. 1937లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా, అప్పట్లో అన్ని రకాల పంటల ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేవి. కాల క్రమంలో 1967లో మిర్చి మార్కెట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు క్రమంగా పెరగడంతో, మార్కెట్ కు బస్తాలు పోటెత్తేవి. 2017లో మార్కెట్ సామర్థ్యం 80 వేల బస్తాలు ఉంటే లక్షకు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి రావడంతో మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. పోటెత్తిన మిర్చితో కొనుగోళ్లు సకాలంలో జరగక రైతులు కోపోద్రిక్తులుగా మారి మార్కెట్ ను ధ్వంసం చేశారు.
దీంతో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతుల అవస్థలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావించారు. ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించి, రైతు సంఘాలు, ట్రేడర్లతో మాట్లాడి మోడల్ మార్కెట్ ప్లాన్ రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఉన్న 80 వేల సామర్థ్యాన్ని పెంచుతూ, రెండు లక్షల బస్తాల సామర్థ్యంతో నూతన మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. రైతులు ఆత్మ గౌరవంతో పంటలు అమ్ముకునేలా కొత్త మార్కెట్ నిర్మాణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా వస్తున్న సౌకర్యాలు...
రైతులు మిర్చి పంట అమ్ముకోవడానికి వస్తే, తమ కష్టాలు మర్చిపోయేలా విశ్రాంతి భవనం, మూడు టాయిలెట్ బ్లాక్స్, నాలుగు ఆర్వో వాటర్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తున్నారు. రైతులు టిఫిన్స్, భోజనాలు చేసేలా హైజీనిక్ గా క్యాంటీన్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో షెడ్ ఏరియా 1.20 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉండగా, దాన్ని 3.50 లక్షల స్క్వేర్ ఫీట్లకు పెంచనున్నారు. ఒక్కో షెడ్ 121 మీటర్లు పొడవు, 27 మీటర్ల వెడల్పుతో మొత్తం ఆరు షెడ్లు నిర్మించనున్నారు. మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోళ్లతో పాటు అవసరమైతే అక్కడే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
భవిష్యత్ లో వేర్ హౌజ్ షెడ్లతో పాటు, కోల్డ్ స్టోరేజీలకు సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటుచేస్తారు. మరో ఆర్సీసీ బిల్డింగ్ లో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో అమ్మకాల కోసం, ఫస్ట్ ఫ్లోర్ లో రైతు విశ్రాంతి భవనం, దడవాయి మీటింగ్ హాల్, ట్రేడర్స్ అండ్ కమీషన్ ఏజెంట్స్ మీటింగ్ హాల్స్ ఏర్పాటుకు ప్లాన్ చేశారు. మార్కెట్ కు వచ్చే రహదారులను కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా విస్తరిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మూడు అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. కొత్త మార్కెట్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మిర్చి మార్కెట్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.
సంక్రాంతిలోపు అందుబాటులోకి తెస్తాం..
ఖమ్మంలో కొత్త మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి సంక్రాంతి లోపు రైతులకు అందుబాటులోకి తెస్తాం. పంట అమ్ముకోవడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోడల్ మార్కెట్‌ను తీర్చిదిద్దుతున్నాం. మూడు నెలల్లో పనులు పూర్తి చేయిస్తాం. - తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
