
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు: మంత్రి ఉత్తమ్
- రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లోని సమస్యలను పరిష్కరిస్తం
- గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయబోమని వెల్లడి
- హైటెక్స్‌లో నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో షురూ
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు: మంత్రి ఉత్తమ్
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో టాప్‌లో నిలపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడానికిరానున్న బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నేషనల్రియల్ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(నారెడ్‌కో) తెలంగాణ ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో నారెడ్కో ఒక భాగమని, ఈ సంస్థకు అండగా ఉంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బిల్డింగ్‌లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిన అనుమతులను, ఎన్ఓసీలను తమ ప్రభుత్వం రద్దు చేయదని పేర్కొన్నారు. క్రెడాయ్, ట్రెడ్కో, నారెడ్కో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, నెలలో ఒకసారైన ప్రభుత్వంతో సమావేశం కావాలన్నారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ప్రపంచ స్థాయి స్కిల్, స్పోర్ట్స్ వర్సిటీల ఏర్పాటు
హైదరాబాద్నగరం చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. దీంతో పాటు నగరంలో తాగు నీటి సరఫరాను పెంచుతున్నామని, మెట్రోను పొడిగిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రపంచ స్థాయి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం 128వ స్థానంలో ఉన్నట్టు తెలిసిందని, ఈ రంగంలో మరింత మెరుగైన స్థానం దక్కించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తమది గత ప్రభుత్వాల మాదిరి కాదని, ప్రజాస్వామ్య ప్రభుత్వమన్నారు. అనంతరం గ్రేస్ క్యాన్సర్ రన్ ఫౌండేషన్‌కు రూ.10 లక్షల చెక్కును మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా నరెడ్కో అందజేసింది. ఈ సమావేశంలో నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయ్‌సాయి మేక, వైస్ ప్రెసిడెంట్ కిరణ్, జనరల్ సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి, నారెడ్కో నేషనల్ ప్రెసిడెంట్హరిబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.