
శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించేందుకు 2021-22లో బీఆర్ఎస్ ఒప్పుకుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగింతకు కూడా 2021లో బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు. 2023 నవంబర్ లో సాగర్ ను ఏపీ ఆక్రమించింది.. ఏపీ ఆక్రమణ తర్వాతే సాగర్ సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లిందన్నారు.
ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజు 4.2 టీఎంసీలు తీసుకెళ్లారని చెప్పారు ఉత్తమ్. రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ హయాంలో రోజూ 9.6 టీఎంసీలు దోచుకెళ్లారని ఆరోపించారు ఉత్తమ్. కృష్ణా నీళ్లను ఏపీకి దోచి పెట్టినందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడుతామని వ్యాఖ్యానించారు.
ఏపీ నీళ్ల దోపిడికి పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగన్ దోస్తీ కోసం రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వదిలేశారని చెప్పారు. పదేళ్లలో శ్రీశైలం నుంచి ఔట్ సైడ్ బేసిన్ 1200 టీఎంసీలు తరలించారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. 298 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత,చేతగాని తనం వల్లే పాలమూరుకు నీటి కష్టాలు వచ్చాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం టెలిమెట్రీ పరికరాలు కూడా పెట్టలేదని విమర్శించారు.
కేసీఆర్ పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు ఉత్తమ్. నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని
కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీకి వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. అప్పుల నుంచి బయటపడేందుకు తాము ప్రయత్నిస్తుంటే..బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పదేళ్లు పూర్తిగా పడుకోబెట్టారని ఆరోపించారు. లక్షా 85 వే లకోట్లు ఖర్చు చేసి ఎకరాకు నీళ్లివ్వలేదన్నారు ఉత్తమ్. సగం పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదు.. విభజన చట్టం అమలు కోసం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.
మేడిగడ్డ కూలితే ఒక్క పిల్లరే కూలిందని వాదిస్తున్నారు. వాళ్లే కట్టారు..వాళ్లే దోచుకున్నారు..వాళ్లే కూలగొట్టారు. కాళేశ్వరం అప్పులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ భారమే. పాలమూరుకు వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నిళ్లివ్వలే. నీళ్ల కోసం కాదు బీఆర్ఎస్ నేతలు జేబులు నింపేందుకు కట్టారు. కృష్ణా నీళ్లలో ఏపీ దోపిడిని కేంద్రానికి వివరించాం.. కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఏపీ నీళ్ల దోపడిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉత్తమ్ అన్నారు.