ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి

ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి
  • సాగుకు జీవం... రైతుకు ఊతం : మంత్రి తుమ్మల
  • కమీషన్ల కోసం పనులు చేపట్టిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ : మంత్రి పొంగులేటి

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/అశ్వాపురం, వెలుగు : ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇరిగేషన్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో గురువారం మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రుద్రమకోట ఇందిరా సాగర్‌‌‌‌ ఏపీలోకి పోయిందని విమర్శించారు. కిన్నెరసాని అభయారణ్యం పేర రాజీవ్‌‌‌‌సాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ను పక్కకు పెట్టారన్నారు. రూ. 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌‌‌‌సాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తయ్యే అవకాశం ఉన్నా, రీ డిజైన్‌‌‌‌ అంటూ కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ సీతారామ పేరున రూ.18 వేల కోట్లకు పెంచిందని విమర్శించారు. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ను పూర్తి చేసి ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పారు. 

పదేండ్ల కాలంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సీతారామకు నీళ్ల కేటాయింపులు తేలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే పర్మిషన్స్‌‌‌‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పది రోజుల్లో సీడబ్ల్యూసీ నుంచి అప్రూవల్‌‌‌‌ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైనల్‌‌‌‌ డీపీఆర్‌‌‌‌ను సైతం సబ్మిట్‌‌‌‌ చేశామన్నారు. వారం రోజుల్లో గోదావరి రివర్‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌ జరగనుందని చెప్పారు. 67 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్‌‌‌‌ను సైతం తమ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేదన్నారు. పాలమూరులో రూ. 27వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎకరాకు కూడా నీరు రాలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు.

రోళ్లపాడును పక్కన పెట్టిన్రు : మంత్రి పొంగులేటి
సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి రిజర్వాయర్‌‌‌‌ లేకుండానే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్​ఇష్టమొచ్చినట్టుగా కమీషన్ల కోసం పనులు చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా మొదట ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు రిజర్వాయర్‌‌‌‌ వద్ద శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత అభయారణ్యం పేర ఆ మాటే మర్చిపోయారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులపై కేసీఆర్​కక్ష కట్టి రోళ్లపాడుకు శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. 

80 వేల పుస్తకాలు చదివిన పెద్దాయనకు లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో రిజర్వాయర్‌‌‌‌ నిర్మించడం ముఖ్యమని తెలియదా అని ఎద్దేవా చేశారు. కృష్ణ, గోదావరి నదులను అనుసంధానం చేయడం వైఎస్సార్‌‌‌‌ కల అని, దానిని సాకారం చేసిన ఘనత సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికే దక్కిందన్నారు. పాలేరు వద్ద చిన్న మోటారు పెడితే కోదాడ, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు నీళ్లు వస్తాయని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన లీడర్‌‌‌‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. రూ. 120 కోట్లు ఖర్చు పెడితే మున్నేరు నుంచి 35 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవచ్చన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న విషయాన్ని హరీశ్‌‌‌‌రావు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

గత సర్కార్‌ మోటార్లను పడావు పెట్టింది :  మంత్రి తుమ్మల 
గత ప్రభుత్వం కమీషన్ల కోసమే మోటార్లు కొనుగోలు చేసి, నాలుగేండ్లుగా పడావు పెట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు ఆరోపించారు. పూసుగూడెం పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద ఆయన మాట్లాడారు. మోటార్లు పాడవకుండా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం మొదటి ఐదేండ్లలోనే సీతారామ పనులు చేసి రెండో ఐదేండ్లలో ఫండ్స్‌‌‌‌ కేటాయించలేదన్నారు. పది కిలోమీటర్ల ఫారెస్ట్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ వస్తే పాలేరుకు గోదావరి నీళ్లు వస్తాయని చెప్పారు. 

యాతాలకుంట, జూలూరుపాడు టన్నెల్స్‌‌‌‌ను పూర్తి చేయడంతో పాటు హెడ్‌‌‌‌వర్క్స్‌‌‌‌, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌‌‌‌ పూర్తి చేయడం, ఇతరత్రా పనుల కోసం మరో రూ. 8 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. సీఎం, ఇరిగేషన్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ కేటాయిస్తే దశల వారీగా పనులు చేపడుతామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వడమే కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌తో గోదావరి నీళ్లను పాలేరు నుంచి కోదాడ, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు తరలించే ప్లాన్‌‌‌‌ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి మూడు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లలో మోటార్లను స్విఛాన్‌‌‌‌ చేయడమే నిదర్శనమన్నారు. గోదావరి తల్లి అందరినీ ఆశీర్వదిస్తుందని, హరీశ్‌‌‌‌రావు కూడా వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చని సూచించారు. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌తో సాగుకు జీవం, రూ. 2 లక్షల రుణమాఫీతో రైతుకు ఊతం ఇస్తూ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సర్కార్​ ముందుకు సాగుతోందని చెప్పారు.