
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థను అవమానించడం సరికాదని.. నాలుగు కోట్ల మంది ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం రిపోర్టుపై మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలంటే బీఆర్ఎస్కు చులకనభావమని.. ఆ పార్టీ నేతలకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయేలా చేసిన దుర్మార్గులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను వెలికితీసిన జస్టిస్ పీసీ ఘోష్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ స్వార్థం కోసం న్యాయ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టి మరింత దిగజారుతున్నారని నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడ్డాయని.. అది తట్టుకోలేక కమిషన్ ను నివేదిక తప్పంటున్నారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని.. నివేదికలో ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అంతకుముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు లేకుండా వండివార్చిన రిపోర్ట్ బయటపెట్టారని విమర్శించారు. దేశంలో గతంలో ఎంతో మంది రాజకీయ నేతలపై ఎన్నో కమిషన్లు వేశారు.. కానీ అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదని గుర్తు చేశారు.
కేసీఆర్‌ను హింసించడమే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. పోలవరం మూడుసార్లు కుప్పకూలినా వెళ్లని ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డలో చిన్న ఘటన జరగ్గానే పిలవకుండానే వచ్చిందని విమర్శించారు. అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి అసలు వాస్తవాలను ప్రజల ముందుంచుతామన్నారు.