టన్నెల్​లో పరిస్థితి ఏమీ బాగాలేదు..మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

టన్నెల్​లో పరిస్థితి ఏమీ బాగాలేదు..మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది: మంత్రి ఉత్తమ్​
  • ఎయిర్ సప్లె పైప్​లైన్ పూర్తిగా ధ్వంసమైంది
  • 10 వేల క్యూబిక్​ మీటర్ల మేర బురద..  అది తీయడమే పెద్ద టాస్క్​
  • నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్​ను అందుబాటులోకి తెస్తం
  • లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నం
  • ఎస్ఎల్​బీసీని పదేండ్లు పట్టించుకోని బీఆర్ఎస్..
  • ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తున్నదని ఫైర్​
  • నాలుగు రోజులుగా ఘటనా స్థలం వద్దే మంత్రులు
  • సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు

మహబూబ్​నగర్​/నాగర్​కర్నూల్​, వెలుగు:ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇరిగేష న్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైందని తెలిపారు. మంగళవారం సాయంత్రం  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి టన్నెల్​లో సహాయక చర్యలను పరిశీలించారు. 

అనంతరం ఆర్మీ, ఎన్​డీఆర్ఎఫ్​, ఎస్​డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీమ్స్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రత్యేకమైనదని, ఈ ప్రమాదాన్ని ఊహించలేదని చెప్పారు. టన్నెల్​లో అత్యంత క్లిష్టమైన 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​లో జరిగిన​ ప్రమాదంలో బాధితులు బయటపడేందుకు రెండు మార్గాలు ఉన్నాయని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. 

సీఎం రేవంత్​ రెడ్డి సూచించినట్టు వర్టికల్​గా, పక్క నుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టన్నెల్​లో 11 కిలోమీటర్ల తర్వాత నీరుందని, అయినా.. రెస్క్యూ టీమ్స్​ 11.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయని చెప్పారు. 13 .5 కిలోమీటర్​ టన్నెల్​ బోరింగ్​ మెషీన్​(టీబీఎం) ఉందని, అక్కడికి వెళ్లేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. 

లోపల బురద, నీరు ఎంత దూరం వరకు ఉంది? అనేది తేల్చడానికి జీఎస్ఐ, ఎంజీఆర్ఐ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు.  టీబీఎం నుంచి 40 మీటర్ల వరకు నీరు, బురద ఉందన్నారు. ప్రమాదం జరిగిన పాయింట్​ వద్ద 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు  ఉన్న బురద 10 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. బురద, నీటిని బయటికి తీయడమే సవాల్​గా మారిందని చెప్పారు.

కన్వేయర్ బెల్ట్ కు రిపేర్లు చేస్తున్నారని, బుధవారం రాత్రి వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.  ఇది అందుబాటులోకి వస్తే గంటకు 800 క్యూబిక్​ మీటర్ల బురదను బయటికి తీసే వీలుందని చెప్పారు.  టన్నెల్​లో గంటకు 3,600 నుంచి 5 వేల లీటర్ల ఊట నీరు వస్తున్నదని తెలిపారు. నీటితోపాటు బురదను బయటికి తీయడానికి సపరేట్​ పైపులైన్​ను వినియోగించనున్నట్టు చెప్పారు. 

పదేండ్లు ఎస్ఎల్​బీసీని ఎందుకు పక్కన పెట్టారు?

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్..​ ఎస్ఎల్​బీసీని ఎందుకు పక్కన పెట్టిందని మంత్రి ఉత్తమ్​ప్రశ్నించారు. 2005లో ప్రారంభించి.. ఈ ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తి చేయాలని అనుకున్నట్లు చెప్పారు. 44  కిలోమీటర్లు టన్నెల్​ తవ్వాల్సి ఉండగా 33 కిలోమీటర్ల వరకు తవ్వేందుకే 20 ఏండ్లు పట్టిందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని తెలిపారు. 

ఇప్పుడు ప్రమాదం జరిగాక ఆ పార్టీ (బీఆర్ఎస్​) లీడర్లు పిచ్చిమాటలు, దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఏడుగురు, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్​ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8  మంది చనిపోయినా.. నాడు తాము ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.

సర్వశక్తులు ఒడ్డుతున్నం

టన్నెల్​లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు మంత్రి ఉత్తమ్​ చెప్పారు. బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ చీఫ్​, ​టన్నెల్ రోడ్ల నిర్మాణంలో అనుభవం ఉన్న జనరల్​ హర్పాల్​ సింగ్​తో మాట్లాడామని తెలిపారు. సహాయక చర్యలపై ఎల్​అండ్​టీ సంస్థకు చెందిన క్రిస్​ కూపర్​, ఇతర సంస్థల నిపుణులతో చర్చించి సహాయక చర్యలను ప్రభుత్వ కార్యదర్శి అర్వింద్​ కుమార్​ కోఆర్డినేట్​ చేస్తారని వివరించారు. వీరికి తోడుగా నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ, నేషనల్​ జియోగ్రాఫికల్​ రీసెర్చ్​ ఏజెన్సీ, బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ ప్రతినిధులు పరిశీలిస్తారన్నారు. 24 గంటలు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.

4 రోజులుగా మంత్రులు అక్కడే..

ప్రమాదం జరిగిన శనివారం నుంచి ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలం వద్దే ఉంటున్నారు. ఆదివారం మంత్రి జూపల్లి సాహసం చేసి రెస్క్యూ టీమ్స్​తో కలిసి టన్నెల్​ లోపలికి వెళ్లారు. దాదాపు 5 గంటలపాటు అక్కడే ఉన్న ఆయన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బయటకు తిరిగొచ్చారు. 

మంత్రి ఉత్తమ్​ కూడా సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రెస్య్కూ టీమ్స్​తో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఇతర ప్రాంతాలకు చెందిన టన్నెల్​ నిర్మాణ సంస్థలతో ఘటనపై చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి 2 రోజులుగా ఘటన ప్రాంతంలోనే ఉంటున్నారు. సహచర మంత్రులతో కలిసి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్​ రెడ్డికి వివరిస్తూ.. ఆయన ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయమే చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రెస్క్యూ ఆపరేషన్​ను స్వయంగా పరిశీలించడంతోపాటు అధికారులతో రివ్యూ నిర్వహించారు.