- తుమ్మిడిహెట్టి డీపీఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి :
- కల్వకుర్తి 29వ ప్యాకేజీ అంచనాలు అంతలా ఎలా పెరిగాయని ప్రశ్న
- జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో కీలక రివ్యూ
హైదరాబాద్, వెలుగు: వాస్తవిక అంశాలతో ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పూర్తయ్యే ప్రాజెక్టుల లిస్టును తీసి.. ఆయా టైం ఫ్రేమ్‌కు తగ్గట్టుగా ఆయకట్టును అందించే ప్రాజెక్టుల వివరాలను అందించాలని సూచించారు. 6, 12, 18, 24 , 30 , 36 నెలల చొప్పున టైమ్ ఫ్రేమ్వారీగా ఆయకట్టును ఇచ్చే ప్రాజెక్టుల లిస్ట్‌ను సిద్ధం చేయాలన్నారు.
ఈ నెల 26 కల్లా ప్రాజెక్టుల స్టేటస్‌పై వివరాలు ఇవ్వాలన్నారు. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు కన్సల్టెంట్ల ఎంపికను డిసెంబర్ 5 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ జనరల్అంజద్ హుస్సేన్, మినిస్టర్ ఓఎస్డీ భీంప్రసాద్, జాయింట్‌సెక్రటరీ కె. శ్రీనివాస్‌తో కలిసి జలసౌధలో ఆయన రివ్యూ చేశారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుకు తగ్గట్టుగా డిజైన్లను తయారు చేసే కన్సల్టెంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ల ద్వారా వచ్చిన అప్లికేషన్లలో ఐదు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసిన నేపథ్యంలో.. ఏయే సంస్థలకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, ఫైనాన్షియల్ బిడ్స్ ను పంపాలో త్వరగా తేల్చాలని సూచించారు. ఆర్వీ అసోసియేట్స్+ఐఐటీ చెన్నై+ఐప్రీసస్ (స్పెయిన్ కంపెనీ)కి డిజైన్ కన్సల్టెంట్‌గా నియమించే సానుకూలతలను పరిశీలించాలని సూచించారు.
తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి..
తుమ్మిడిహెట్టి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ తయారీ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని అధికారులను మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఏ ఎత్తుతో నిర్మిస్తే ఎంత లాభమో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఎత్తు ప్రకారం నీటి లభ్యత వివరాలపై సైంటిఫిక్‌గా హైడ్రాలజీ డేటాను ఇవ్వాలన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్సమస్యలను సుప్రీంకోర్టు ఇటీవల పరిష్కరించిందని.. రిజర్వాయర్‌లో నీటి నిల్వకు, కాలువల తవ్వకానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 55 ఎకరాల పునరావాసానికి సంబంధించిన సమస్య ఉందని, దానిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కల్వకుర్తి 29వ ప్యాకేజీ రివైజ్డ్ఎస్టిమేట్స్ఎందుకు పెరిగాయని మంత్రి ప్రశ్నించారు. భూసేకరణ, జీఎస్టీ వల్ల రేట్లు పెరిగాయని అధికారులు చెప్పారు. అంత పెరగకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. ఆర్థిక శాఖ నుంచి ఫండ్స్ త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ వద్ద ఫైళ్లపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని, ఎందుకు జాప్యం జరుగుతున్నదని అధికారులను ప్రశ్నించారు.
భూసేకరణలో సమస్యలేంటి?
ప్రాధాన్య ప్రాజెక్టుల్లో భూసేకరణలోని సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్సూచించారు. ఇప్పటికే ప్రారంభించి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి కోసం చర్యలు చేపట్టాలన్నారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుపై సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. చత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీని త్వరగా సాధించాలని చెప్పారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చనాకా కొరాట, చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు ప్రాజెక్టులకు ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి అనుమతులు వచ్చాయని, ఆయా ప్రాజెక్టులకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సులను పొందాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే పీఎం కృషీ సించాయీ యోజన కింద ఆర్థిక సాయం పొందేలా ప్రయత్నాలు చేయాలన్నారు.
2023 డిసెంబరు 7 నుంచి వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల వివరాలతో పాటు.. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులకు ఎన్ని నిధులు అవసరమవుతాయో జాబితాను తయారు చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు.
