ప్రమాదంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు.. : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రమాదంలో  అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు.. : ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్​లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాది పడిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్, జగన్ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రగతిభవన్​లో వాళ్లిద్దరూ చర్చలు జరిపారు. ఆ వెంటనే  కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ స్కీమ్​కు బీజం పడింది” అని చెప్పారు. 

లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అది మొత్తం కూలిపోయే స్థితికి చేరిందని ఉత్తమ్ చెప్పారు. బ్యారేజీల పరిస్థితిపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలో మిగిలిన రెండు బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడించారు. ‘‘అక్టోబర్ ​21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.

మిగిలినవి కూడా కుంగిపోతున్నాయి. కానీ నాటి నుంచి నేటి వరకు వాటిపై కేసీఆర్​ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గతంలో కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అవి కుంగిపోవడంతో ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.