కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం..బ్యారేజీ, డ్యామ్‌‌‌‌‌‌‌‌కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు

కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం..బ్యారేజీ, డ్యామ్‌‌‌‌‌‌‌‌కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు
  • ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ 
  • అన్నింటిలోనూ లోపాలు ఉన్నట్టు ఘోష్ కమిషన్ తేల్చింది
  • బ్యారేజీ, డ్యామ్‌‌‌‌‌‌‌‌కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు: ఉత్తమ్
  • ఇందులో అప్పటి సీఎం, ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్ల తప్పు ఉంది 
  • ప్రాజెక్టు ప్రారంభం నుంచే లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ చెప్పింది
  • ఇంజినీర్లు ముందే హెచ్చరించినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు
  • తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అబద్ధాలు చెప్పి.. లొకేషన్ మార్చారు 
  • లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు 
  • దేశ చరిత్రలో ఇలాంటి మానవ తప్పిదం ఏదీ లేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగిందని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని ఆయన వెల్లడించారు. ‘‘బ్యారేజీ, డ్యామ్‌‌‌‌కి తేడా తెలవకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. బ్యారేజీ కట్టి డ్యామ్‌‌‌‌లా ఉపయోగించాలని అనుకున్నారు. అందుకే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని ఎన్డీఎస్ఏ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులు స్పష్టం చేశాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి మానవ తప్పిదం ఏ  రాష్ర్టంలోనూ జరగలేదు” అని అన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆదివారం అసెంబ్లీలో ఉత్తమ్ ప్రవేశపెట్టారు. అంతకుముందు రిపోర్టును హార్డ్, సాఫ్ట్ కాపీల రూపంలో సభ్యులందరికీ అందజేశారు. అనంతరం కమిషన్ రిపోర్టులోని అంశాలను సభకు ఉత్తమ్ వెల్లడించారు. ‘‘ఏ బ్యారేజ్‌‌‌‌లో అయినా తక్కువ నీళ్లు స్టోర్ చేస్తారు. కానీ మేడిగడ్డ బ్యారేజీలో మాత్రం ఫుల్ కెపాసిటీతో నీళ్లు నిల్వ చేయాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. అక్కడ నీళ్లు నిల్వ చేయెద్దని అధికారులు హెచ్చరించినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దాని ఫలితంగానే మేడిగడ్డ కుంగింది. ఈ బ్యారేజీకి రిపేర్లు చేయాలని 2022లో అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావు రిపోర్ట్ నాటి పాలకులు పట్టించుకోలేదు. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్,  పూర్ క్వాలిటీ, పూర్ మెయింటెనెన్స్ అని కమిషన్ తేల్చింది” అని వివరించారు. 

‘‘మేడిగడ్డ కుంగినప్పుడు బీఆర్ఎస్ వాళ్లే అధికారంలో ఉన్నారు. ఆనాడే ఎన్డీఎస్ఏ నిపుణులు వచ్చి చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఎన్డీఎస్ఏ మీద కూడా బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచే  మేడిగడ్డ బ్యారేజీ వీక్ అయింది. పైపులు, నీళ్లు, ఇసుక వెళ్లే  ప్రాంతం డ్యామేజీ అయిందని ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చారు” అని చెప్పారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై నిజానిజాలు తెలుసుకునేందుకు మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేశాం. కక్షసాధింపు చర్యలకు దిగకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకున్నాం. కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్టును అసెంబ్లీలో పెట్టాం. మీ వల్లే (బీఆర్ఎస్) రాష్ర్టానికి శాశ్వతంగా నష్టం జరిగింది. అబద్ధాలు చెప్పి ప్రాజెక్టును తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు. అందుకే బ్యారేజీ కూలిపోయింది. కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేశారు. మీ నిర్ణయాలతో రాష్ర్ట ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది” అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 

అన్నింటిలోనూ నాటి సీఎం పాత్ర.. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, టెండర్లు, డిజైన్ల రూపకల్పన.. ఇలా అన్ని విషయాల్లో అప్పటి సీఎం ప్రత్యక్ష పాత్ర పోషించారని ఘోష్ కమిషన్ రిపోర్టులో పేర్కొన్నదని ఉత్తమ్ తెలిపారు. రిపోర్టును స్టడీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసిందని చెప్పారు. అందుకే దీనిపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘సీడబ్ల్యూసీ డీపీఆర్‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం తెలపకముందే టెండర్లు పిలిచి కంపెనీలకు కాంట్రాక్టును అప్పగించారు. పనులు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగి ఉండదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం వద్దు అని చెప్పింది. కానీ తుమ్మడిహెట్టి దగ్గర నీళ్లు లేకపోవటంతో మేడిగడ్డ  దగ్గర బ్యారేజీ కట్టామని అప్పటి పాలకులు ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్ అన్ని రికార్డులను పరిశీలించి.. వాళ్లు చెప్పింది అబద్ధమని తేల్చింది. ‘తుమ్మడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అన్నది నిజం కాదు. అక్కడ నీళ్లు ఉన్నాయి. అయినా అప్పటి పాలకులు అబద్ధం చెప్పారు’ అని కమిషన్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ‘టెండర్లు, కాంట్రాక్టులు, డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు.. ఇలా అన్ని విషయాల్లో రూల్స్ ఉల్లంఘించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు తరువాత అనుసరించిన విధానాలు కూడా సరిగాలేవు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయిన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. అంచనాల పెంపులో రూల్స్ ఫాలో కాలేదు. కాంట్రాక్టర్లకు మేలు చేశారు’ అని కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. దీనికి అప్పటి సీఎం, ఇరిగేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ పూర్తిగా బాధ్యత వహించాలని కమిషన్ చెప్పింది” అని వివరించారు.
 
ఐదేండ్లలో 100 టీఎంసీలు.. 

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ అన్నారు. ‘‘ఏడాదికి 195 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తామని ప్రాజెక్టు ఓపెనింగ్ టైమ్ లో ప్రకటించారు. కానీ ప్రాజెక్టు ప్రారంభమైన నాటి డ్యామేజీ అయ్యే వరకు ఐదేండ్లలో 165 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు. ఇందులో 35 టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారు. మిగిలిన 130 టీఎంసీల్లో 14 టీఎంసీలు వృథా అనుకుంటే.. నికరంగా లిఫ్ట్ చేసింది 114 టీఎంసీలు మాత్రమే. ఇక కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌లో 13 టీఎంసీలు స్టోరేజ్ ఉన్నాయి. అంటే లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఐదేండ్లలో తెలంగాణకు ఉపయోగపడింది 101.5 టీఎంసీలు మాత్రమే. ఈ లెక్కన ఏడాదికి 20.5 టీఎంసీలు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహితను  పక్కనపెట్టి  రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారు. 34 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇస్తామని చెప్పి.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు” అని చెప్పారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన కరెంట్ బిల్లుల ఇంకా రూ.9వేల కోట్లు కట్టాల్సి ఉందని చెప్పారు.  

కాళేశ్వరం నీళ్లు లేకున్నా.. రికార్డు స్థాయిలో వడ్లు 

కాళేశ్వరం నీళ్లు రాకున్నా రికార్డు స్థాయిలో వడ్లు పండాయని ఉత్తమ్ తెలిపారు. ‘‘డిసెంబర్ 2023లో మేం అధికారంలోకి వచ్చాం. అప్పటి నుంచి కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేదు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు అయింది. రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. కానీ అవన్నీ కాళేశ్వరం నీళ్లు అంటూ బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతున్నది” అని మండిపడ్డారు. మేడిగడ్డకు డ్యామేజీకి ముందు, తర్వాత వరి సాగు, దిగుబడి లెక్కలను మంత్రి సభలో వెల్లడించారు.