- ఇప్పటికే దీనిపై స్టడీ చేసినం..ఖర్చు 10 -12 శాతం కట్
- భూసేకరణ ఖర్చు రూ.1600 కోట్ల వరకు ఆదా
- కాలువలు, టన్నెల్ దూరం తగ్గుతుంది
- త్వరగా డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం
- సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాంకేతికంగా, ఆర్థికంగా అనువుగా ఉన్న ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే అధ్యయనం చేశామని వెల్లడించారు. అందులో భాగంగా సుందిళ్లకు నీటిని తరలిచే అలైన్‌మెంట్ ద్వారా ఖర్చు 10 నుంచి 12 శాతం వరకు తగ్గుతుందని తేల్చినట్టు చెప్పారు.
భూసేకరణ కూడా తగ్గుతుందని, ఆ ఖర్చు మరో రూ.1500 కోట్ల నుంచి రూ.1600 కోట్ల వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ అలైన్‌మెంట్‌లో బొగ్గు గనులు కూడా అడ్డం కాబోవని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌లో వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఖర్చు తగ్గించుకుంటూనే సాంకేతికంగా, పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకొని తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తామని చెప్పారు.
సుందిళ్లకు లింక్ చెయ్యడమే సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను ఇందుకోసం వాడుకుంటామని తెలిపారు. త్వరలోనే దీనిపై ఆర్థిక విశ్లేషణ చేసి.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కాలువ దూరంలోనూ తగ్గుదల
సుందిళ్లకు లింక్ చెయ్యడం ద్వారా కాలువ, టన్నెల్ పొడవులు కూడా తగ్గుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కోల్ బెల్ట్ సమస్య ఉండదని, ఫలితంగా పర్యావరణ అనుమతులకు ఇబ్బందులు రావని చెప్పారు. గతంలో చేసిన సర్వేలను మరోసారి వ్యాలిడేట్ చెయ్యాలని, కొత్తగా జియో టెక్నికల్ స్టడీ, నేల పరిస్థితులపై అధ్యయనం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
కరెంటును తక్కువగా వాడుకునేలా కొత్త ప్రతిపాదనపై పని చేస్తున్నామని తెలిపారు. రీడిజైన్‌లో భాగంగా పంప్ హౌస్‌లు, టన్నెల్ పొడవు, లిఫ్టుల కెపాసిటీ లాంటి వాటిపై ఆరా తీశారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లితో పోలిస్తే.. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు గ్రావిటీ కెనాల్ పొడవు 30 కిలోమీటర్ల నుంచి 13 కిలో మీటర్లకు, టన్నెల్ పొడవు 24 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లకు తగ్గుతుందని అధికారులు వివరించారు.
30 మెగావాట్ల కరెంట్ సరిపోతుందని, 10 పంప్ హౌస్‌లు చాలని చెప్పారు. దీంతో ఈ రీడిజైన్‌కు సంబంధించి వెంటనే రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేయాలని అధికారు లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డీపీఆర్ పూర్తయ్యాక కేబినెట్‌లో పెట్టి చర్చిస్తామని తెలిపారు.
సరైన సమయంలో మహారాష్ట్రతో చర్చలు
ప్రాజెక్ట్ ఎత్తుపైనే సమస్య ఉందని, గతంలో మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోకపోవడంతో ఈ సమస్య వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సరైన సమయంలో మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. సాంకేతిక, ఆర్థిక విశ్లేషణలు, డీపీఆర్ పూర్తయ్యాక ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చెయ్యడం.. టెండర్ల ఆహ్వానంలాంటి వాటిపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
“ఫస్ట్ సర్వే చెయ్యండి.. డిజైన్లపై వ్యాలిడేట్ చేసుకోండి. ఆ తర్వాత దానిపై సమగ్రమైన రివ్యూ జరిగిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టండి. రైతు నేస్తంలా ప్రాజెక్టు ఉండాలి” అని సూచించారు. కాగా, తుమ్మిడిహెట్టితోపాటు సమ్మక్కసాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఫండింగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలాంటి అంశాలపైన మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు.
ఇంటర్ స్టేట్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ వింగ్స్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దేవాదుల ప్రాజెక్ట్ పురోగతి, ఎస్ఎల్బీసీ హెలికాప్టర్ సర్వేపైనా చర్చించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్ఙా, ఈఎన్సీ అంజద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయండి
మొంథా తుఫాన్ నేపథ్యంలో వడ్లు, పత్తి, మక్కజొన్నలు తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రులు సూచించారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్ డీలో సివిల్ సప్లయ్స్ అధికారులతో సమావేశం, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వేర్వేరుగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ “మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలి” అని సూచించారు. అధికార యంత్రాంగం వచ్చే 30 నుంచి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో సమష్టిగా పని చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 4,428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలిన 3,814 కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. సోమవారం నాటికి ప్రభుత్వం 22,433 మంది రైతుల నుంచి 1,80,452 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ. 431.09 కోట్లు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
