హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఆయన పర్యటించారు. రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ కాలనీ పనులను, ఐఐటీ కళాశాల నిర్మాణాలను పరిశీలించడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను, అంగన్‌వాడీలకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు.
అనంతరం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ. 19,500 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. కృష్ణా-గోదావరి జలాల వాటా సాధనలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.
