ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర.. ఎన్ని అడ్డంకులొచ్చినా బీసీలకు 42 శాతం ఇస్తాం: మంత్రి వాకిటి

 ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర.. ఎన్ని అడ్డంకులొచ్చినా బీసీలకు 42 శాతం ఇస్తాం: మంత్రి వాకిటి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.  హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన... బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తామని చెప్పారు. స్టే తోనే ఆగిపోలేదని..బీసీ  బిడ్డలు అధైర్య పడొద్దని సూచించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. 

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఒప్పుకుంటారని ఆశించాం.. హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు మంత్రి వాకిటి.  శాస్త్రీయ పద్ధతిలోనే   బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  ఇచ్చామన్నారు.   బీసీ రిజర్వేషన్ల కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నామని చెప్పారు.  బీసీల నోటికాడి ముద్దను లాక్కొనే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు.  బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు వాకిటి. 

బీఆర్ఎస్,బీజేపీ కుమ్మక్కు: జూపల్లి

గతంలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేశామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.  ఇంటింటికి తిరిగి కులగణన చేసి చట్టం కల్పించామని చెప్పారు. బీసీ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి దగ్గర బ్రేక్ వేసింది బీజేపీనే అని ఆరోపించారు.  బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో పిటిషన్ వేశారని ఫైర్ అయ్యారు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  బీసీలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు.  న్యాయబద్ధంగా ఎవరి కి రావాల్సిన వాటా వారికి రావాలన్నారు.  స్టే వచ్చింది కానీ కోర్ట్ ఇంకా కారణాలు  చెప్పలేదన్నారు.  ఎం చేస్తాం అనేది సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు జూపల్లి. 

జీవో 9పై హైకోర్టు స్టే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే..కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది కోర్టు.