ఫస్ట్ టైం డబుల్​ బెడ్రూం ​ఇండ్లపై మంత్రి ప్రశాంత్​ రెడ్డి రివ్యూ

ఫస్ట్ టైం డబుల్​ బెడ్రూం ​ఇండ్లపై మంత్రి ప్రశాంత్​ రెడ్డి రివ్యూ

పేదవాడు ఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌న్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.పేదల సొంతింటి కల నిజం చేయడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల​పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,91,057 ఇండ్లకు రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో మంజూరు చేశామన్నారు. ఇందులో 2,28,529 గృహాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. 

నిర్మాణం  ప్రారంభించిన 2,28,529 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయన్నారు. మిగతా 58,350  గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నదని తెలిపారు. మిగతా  40,651 డబుల్ బెడ్రూం ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు.  ఇండ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని, ల‌బ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేప‌ట్టాల‌ని ప్రభుత్వం ఆదేశించిన నేప‌థ్యంలో రాష్ట్రగృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. 

నిర్మాణం పూర్తి అయినా, తుది దశలో ఇండ్లకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల  ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందజేసెందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తెలిపారు.