కాంగ్రెస్​ను టచ్ చేస్తే ..బీజేపీ అడ్రస్​ ఉండదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్​ను టచ్ చేస్తే ..బీజేపీ అడ్రస్​ ఉండదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ప్రభుత్వాన్ని పడగొడ్తవా.. పిచ్చిమాటలు బంజేయ్
  • కిషన్ రెడ్డిపై మంత్రి వెంకట్ రెడ్డి ఫైర్ 
  • కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్రానికి 200 కోట్లు కూడా తేలే
  • నమామిగంగకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు.. మూసీకి ఎందుకివ్వరు? 
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారైందని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొడతామన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి పిచ్చిమాటలు బంజేయాలని అన్నారు. ‘‘త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నడు. ఆ మాటలు సరికాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామనడం పిచ్చి మాటలు.

ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం.. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినంత సులువు కాదు. ఇది పోరాటాల గడ్డ. సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నం. రాష్ర్టంలో కాంగ్రెస్ ను టచ్ చేస్తే, బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తం” అని హెచ్చరించారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మీడియాతో వెంకట్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. టూరిజం మంత్రిగా వేల కోట్ల బడ్జెట్ తన దగ్గర పెట్టుకుని, రాష్ట్రానికి రూ.200 కోట్లు కూడా తేలేదని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష ఎంపీగా ఉండి తాను రూ.3 వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చానని తెలిపారు. ‘‘భువనగిరి ఫోర్ట్ కు రోప్ వే నిర్మాణం కోసం కేంద్ర టూరిజం శాఖ నుంచి రూ.200 కోట్లు కేటాయించాలని నాలుగేండ్లుగా అడుగుతున్నాను. కానీ కిషన్ రెడ్డి నుంచి స్పందన లేదు. మూసీకి నిధులు ఇవ్వాలని పార్లమెంట్ లో నాలుగుసార్లు మాట్లాడాను. అప్పుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన నియోజకవర్గం సికింద్రాబాద్ డ్రైనేజీ నీళ్లు కూడా మూసీలో కలుస్తున్నాయి. ఈ నీళ్లతో నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఫ్లోరైడ్ కు మూసీ నీళ్లు కూడా కారణం. నమామిగంగకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు..  మూసీ డెవలప్ మెంట్ కోసం గత ఐదేండ్లుగా కేంద్రం నుంచి ఎందుకు నిధులు తీసుకురాలేదు” అని ప్రశ్నించారు. 

కేసీఆర్.. ఎంపీగా పోటీ చెయ్

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారైందని.. కానీ పొత్తు లేదంటూ మాయమాటలు చెబుతున్నారని వెంకట్ రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఖరారైంది. నాకు ఈ విషయం ఢిల్లీలో బీజేపీ నేతలు చెప్పారు. ఇప్పుడు పొత్తు లేదు అని మాయమాటలు చెబుతున్నరు. పొత్తు కోసమే ఈ నెల 22న కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నడు. ఇండియా కూటమిలో కేసీఆర్ లేడు. అలాంటప్పుడు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నడో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఖతమైంది. వాళ్లు మెదక్ ఎంపీ కూడా గెల్వరు ” అని విమర్శించారు.  

కేటీఆర్, హరీశ్ కు ఏం తెల్వదు.. 

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘అసెంబ్లీలో కేటీఆర్ వెనుక బెంచీల్లో కూర్చుంటే, హరీశ్ రావు ముందు కూర్చుంటున్నాడు. కేఆర్ఎంబీ, మేడిగడ్డ గురించి కేటీఆర్, హరీశ్ రావుకు ఏం తెల్వదు” అని అన్నారు. 

మూడేండ్లలో ట్రిపుల్ ఆర్ పూర్తి.. 

మూడేండ్లలో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 50 శాతం భూసేకరణ పూర్తయిందని చెప్పారు. ‘‘ట్రిపుల్ ఆర్ సౌత్ ను నేషనల్ హైవేగా ప్రకటిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. కొత్త హైవేలను మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. నల్గొండ లాంటి చిన్న సిటీకి రూ.700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ సాంక్షన్ చేశారు. నెల కింద కోరగా వెంటనే సాంక్షన్ చేశారు. వారంలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. భూసేకరణకు ఆదేశాలు ఇస్తాం. ఈ సందర్భంగా గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.