
మంచిర్యాల: భారీ వర్షాల వల్లే కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి వివేక్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలనికేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడంపై స్పందించారు మంత్రి వివేక్. శుక్రవారం (ఆగస్ట్ 22) మందమర్రి B1 గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లు పెట్టికట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన విషయంలో బీఆర్ఎస్ లీడర్లపైనే చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు కుంగింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులతో కూల్చారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్న లక్ష కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. ఐదేళ్ల నుంచి కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా పంటలు మునిగిపోతుంటే గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించానని తెలిపారు.
ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు గత ఏడాదిలాగే ఇప్పుడు నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రలకు యూరియా పంపిణీ చేసేది కేంద్ర ప్రభ్వుమని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు గల్లీలో కాదు.. ఢిల్లీలో యూరియా కోసం ధర్నాలు చేయాలని సూచించారు.
యూరియా విషయంలో కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణకు రావాలసిన కోటాపై నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ యూరియా కోసం సంబంధిత కేంద్రమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. యూరియా కొరత సృష్టిస్తుంది బీఆర్ఎస్ నేతలేనని.. యూరియా కొరత సృష్టించేందుకు పరిమితికి మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ క్రియాశీలకంగా పని చేస్తున్నారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఓటు చోరీపై తెలంగాణలో కూడా ఆందోళన చేస్తామని తెలిపారు. ఓట్ల చోరీకి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.