విదేశీ భాషలపై పట్టు సాధించాలి...ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు: మంత్రి వివేక్

విదేశీ భాషలపై పట్టు సాధించాలి...ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్, వెలుగు: విదేశీ భాషలపై పట్టు సాధించడం ద్వారా ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. మాదాపూర్‌లోని కెరీర్ కన్సల్ట్జ్  సంస్థలో జపాన్‌లో ఉపాధి అవకాశాలే లక్ష్యంగా  ఆ దేశ భాషను నేర్చుకుంటున్న విద్యార్థులను మంగళవారం ఆయన కలిశారు. వారి అభ్యాస పురోగతిని, భాషా నైపుణ్యాలతోపాటు క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు పొందాలంటే భాషా ప్రావీణ్యం అత్యంత కీలకమని చెప్పారు. 

తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జపనీస్​భాషలో నైపుణ్యం సాధించి, అక్కడ ఉన్నత ఉద్యోగాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. పేదరికాన్ని జయించాలంటే విద్య ఒకటే మార్గమన్నారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.