మీ కుటుంబం అమెరికాకు వెళ్లొచ్చు.తెలంగాణ యువత జర్మనీ వెళ్తే తప్పా?కేటీఆర్‌‌‌‌ను నిలదీసిన మంత్రి వివేక్

మీ కుటుంబం అమెరికాకు వెళ్లొచ్చు.తెలంగాణ యువత జర్మనీ వెళ్తే తప్పా?కేటీఆర్‌‌‌‌ను నిలదీసిన మంత్రి వివేక్
  •  
  •     బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఐటీఐలు నిర్వీర్యం
  •     మేం వచ్చాక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నం
  •     బీఆర్ఎస్‌‌కు 1,400 కోట్లు ఎట్లొచ్చినయో చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకోవడం, విదేశాల్లో ఉద్యోగాలు చేయడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిరంకుశ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సరూర్‌‌నగర్‌‌ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు శనివారం మంత్రి కౌంటర్ ఇచ్చారు. ‘జర్మన్, ఇతర విదేశీ భాషలు ఎందుకు నేర్చుకోవాలి? విదేశాల్లో ఉద్యోగాలు ఎందుకు చేయాలి? అని ప్రశ్నిస్తున్న కేటీఆర్ ముందుగా తన కుటుంబాన్ని చూసుకోవాలి. మీ కుటుంబ సభ్యులు అమెరికాకు ఎందుకు వెళ్లారు? అక్కడ ఎందుకు ఉద్యోగాలు చేశారు? మీ కుటుంబ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లడం సరైనదే అయితే.. తెలంగాణ యువత తమ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లడం తప్పా?’ అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇవాంక ట్రంప్‌‌తో స్నేహం చేయడం గొప్పగా భావించే కేటీఆర్.. తెలంగాణ యువత ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జర్మన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడాన్ని విమర్శించడాన్ని తప్పు పట్టారు. యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్​ స్పష్టం చేశారు.

పదేండ్ల పాలనలో యువతకు అన్యాయం

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీఐలను బలోపేతం చేయడం, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, యువతకు అధిక వేతనాలతో ఉద్యోగాలు కల్పించడంపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తమ కుటుంబ సభ్యులకు పదవులు ఎలా కల్పించాలనే ఆలోచనే తప్ప.. యువత భవిష్యత్తుపై వారు ఎన్నడూ ఆలోచించలేదని విమర్శించారు. తెలంగాణ యువత దుబాయ్, జర్మనీ వంటి దేశాలకు వెళ్లి తమ ప్రతిభతో మంచి ఆదాయం పొందుతున్నారని మంత్రి తెలిపారు. వారు విదేశాల నుంచి పంపుతున్న విదేశీ మారకద్రవ్యం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నదని చెప్పారు. ఈ వాస్తవాలను విస్మరించి కేటీఆర్ రాజకీయ నిరాశతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

మీ పార్టీ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయి?

బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్ల నిధులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నను కేటీఆర్ సోదరి కవితే లేవనెత్తారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు విరాళాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్లు ఉండటం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్నారు. ధరణి పేరుతో రైతులను, భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, 20వేల ఎకరాలు ధరణిలో మార్చివేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిది ద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.