మంచిర్యాల: మంత్రి పదవి కంటే తనకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలే ఎక్కువని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తనకున్న ఏకైక లక్ష్యమని తెలిపారు. గురువారం (జనవరి 15) చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 15కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.
చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ చెన్నూరు నియోజకవర్గానికి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు.. మరీ గత పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిధులు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో 250కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం ఇసులు దందాలు చేశాడని.. భూ మాఫియాను ప్రోత్సహించాడని విమర్శించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు నిధులు కూడా ఇవ్వలేదన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. పది సంవత్సరాలు డబుల్ బెడ్ రూం ఇస్తామని బీఆర్ఎస్ ప్రజలను మోసిందని విమర్శించారు. వాళ్లు మాత్రం వందల ఎకరాల ఫాం హౌజ్‌లు కట్టుకున్నారని నిప్పులు చెరిగారు.
