ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అమలుకు చర్యలు తీసుకుంటాం
  • గిగ్​ వర్కర్లకు ఉద్యోగ భధ్రత కల్పిస్తం
  • అప్పులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి
  • గోదావరి పుష్కరాలపై కేంద్రం వివక్ష: మంత్రి కొండా సురేఖ  
  • ఏపీకి రూ.2 వేల కోట్లు ఇచ్చి.. తెలంగాణను విస్మరించింది 
  • బాసర అభివృద్ధి కోసం డీపీఆర్ రూపొందిస్తామని వెల్లడి 
  • బాసరలో మంత్రుల పర్యటన.. కొత్త బిల్డింగ్స్ ప్రారంభం 

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేసే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటామని కార్మిక, మైనింగ్ ​శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్​వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి బాసర దేవాలయాన్ని వివేక్ సందర్శించారు.  టీటీడీ ఆధ్వర్యంలో రూ.9 కోట్లతో పునర్నిర్మించిన వంద గదుల వసతి సముదాయాన్ని, రూ.3.40 కోట్లతో నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్​ఆఫీస్​ బిల్డింగ్‌‌‌‌ను ప్రారంభించారు. 

అనంతరం మీడియాతో మంత్రి వివేక్ ​మాట్లాడుతూ.. బాసర క్షేత్రాన్ని ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ​ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ‘‘గత బీఆర్ఎస్​ప్రభుత్వం మాపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. అర్హులైన పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌తో పాటు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రాజీవ్​ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపాం. 

విద్య, ఉపాధి, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ భారీగా నిధులు మంజూరు చేస్తున్నాం. విద్యారంగంపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ రంగానికి బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు పెంచారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్​రెసిడెన్షియల్​స్కూల్స్​ నిర్మాణం చేపట్టాం” అని పేర్కొన్నారు.  

బాసరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కొండా సురేఖ 

గోదావరి పుష్కరాల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పుష్కరాల కోసం ఏపీకి రూ. 2 వేల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణను మాత్రం విస్మరించిందని ఫైర్ అయ్యారు. ‘‘యాదాద్రి తరహాలో బాసరను అభివృద్ధి చేస్తాం. గోదావరి పుష్కరాలు, బాసర ఆలయ అభివృద్ధిపై ఇప్పటికే సీఎంతో చర్చించాం. ఆయన సూచనల మేరకు బాసర అభివృద్ధి కోసం డీపీఆర్ రూపొందించనున్నాం. బాసరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది సమ్మక్క, సారక్క జాతర కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు. 

గోదావరి పుష్కర ఘాట్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఒక్క యాదగిరిగుట్టను తప్ప.. ఏ ఒక్క ఆలయాన్ని పట్టించుకోలేదు. అక్కడ కూడా అస్తవ్యస్తంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. మా​ప్రభుత్వం రాగానే ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. ఆలయాల అభివృద్ధికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నిధులు మంజూరు చేయడంతో పాటు ఆలయాల ఆదాయాలను పెంచుతున్నాం. 

దేవాలయాలకు సంబంధించి బ్యాంక్ లాకర్లలో ఉన్న నగదును అభివృద్ధి పనులకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, కలెక్టర్​అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల తదితరులు పాల్గొన్నారు.