ముదిరాజ్‌లకు న్యాయం చేస్తాం.. బీసీ–ఏలోకి మార్చేందుకు సబ్ కమిటీ వేస్తాం: మంత్రి వివేక్

ముదిరాజ్‌లకు న్యాయం చేస్తాం.. బీసీ–ఏలోకి మార్చేందుకు సబ్ కమిటీ వేస్తాం: మంత్రి వివేక్
  •     ముదిరాజ్​ సింహాగర్జన సభలో మంత్రి వివేక్​ వెంకటస్వామి
  •     కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్ అందించేలా కృషి చేస్తానని హామీ
  •     హాజరైన  ఎంపీ వంశీకృష్ణ, ​బండ ప్రకాశ్​  


కోల్ బెల్ట్, వెలుగు: ముదిరాజ్​లను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఏ’ గ్రూపులోకి మార్చేందుకు కేబినెట్​సబ్​ కమిటీ వేసి, ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ముదిరాజ్​లంతా ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవడంతో పాటు అభివృద్ది చెందుతారని అన్నారు. ఆదివారం మంచిర్యాలలో ముదిరాజ్​సింహగర్జన సభకు మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్​బండ ప్రకాశ్​ ముదిరాజ్​ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి​మాట్లాడుతూ జనాభాలో ఎక్కువగా ఉన్నా  ముదిరాజ్​లకు  విద్య, ఉద్యోగ రంగాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ కు ఏటా బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించి, కుల వృత్తుల ఆధునీకరణకు, యువత స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టామ్​కామ్​ ద్వారా స్కిల్స్, లాంగ్వేజ్​ నేర్పించి జర్మనీ, జపాన్​ వంటి దేశాలకు పంపిస్తుందన్నారు.

కేసీఆర్​ ఫ్యామిలీకి 300 ఎకరాల భూములు ఎక్కడివి?

బీఆర్ఎస్​హయాంలో కేసీఆర్​ కుటుంబం వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారని, తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఆర్థికంగా ధ్వంసం చేశారని మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. ఉద్యమం టైమ్​లో 22 ఎకరాల భూములున్న కేసీఆర్​ ఫ్యామిలీకి ఎర్రవెల్లిలో 300 ఎకరాలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆర్మీ నుంచి వచ్చిన ఉన్నతాధికారి  కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కారణమైన లోపాలపై  క్లారిటీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 700 టీఎంసీల నీళ్లు వృథా అయ్యాయని బీఆర్ఎస్​ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.

ముదిరాజ్​లకు అండగా ఉంటా: వంశీకృష్ణ

ముదిరాజ్​సామాజిక వర్గానికి అండగా ఉంటానని, న్యాయమైన వారి హక్కుల సాధన, పెండింగ్​ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,800 ముదిరాజ్ కుల సంఘాల కమిటీలకు ఎన్నికలు నిర్వహించేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాలలో ముదిరాజ్ సంఘ భవనం నిర్మాణానికి తన ఎంపీ ల్యాడ్స్​ నుంచి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

మంత్రి వివేక్​ చొరవతోనే:​ బండ ప్రకాశ్

తెలంగాణ బిడ్డలకు టామ్​కామ్​ద్వారా దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవచూపడం అభినందనీయమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​ ముదిరాజ్​అన్నారు.  రాష్ట్రంలోని ముదిరాజ్​ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సర్కార్​ వెంటనే పరిష్కారించాలని డిమాండ్​ చేశారు. సభలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, ముదిరాజ్ సంఘం మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​ గరిగంటి కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనబోయిన కృష్ణ,  రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​గుర్రాల మల్లేశం, జనరల్​ సెక్రటరీ పల్లెబోయిన అశోక్, రాష్ట్ర యువత అధ్యక్షుడు పండుగ బాలు ముదిరాజ్, సెక్రటరీ ముల్కలపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉపాధి అవకాశాలు

కాంగ్రెస్ సర్కార్​మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహిస్తుందని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సమ్మక్క-సారలమ్మ మహిళ భవన్ లో మూవో సంస్థ సహకారంతో మహిళల కోసం చేపట్టనున్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాట్లను మూవో సంస్థ బాధ్యులు భారతీతో కలిసి పరిశీలించారు. మంత్రి వెంట మందమర్రి తహసీల్దార్​ సతీశ్​ కుమార్​శర్మ  తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లాలోని కాసీపేట, బెల్లంపల్లి మండలాలకు చెందిన పలు బాధిత కుటుంబాలను , పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పరామర్శించారు. 

హమాలీ కార్మికులు దేశానికి వెన్నెముక

కరీంనగర్ /పెద్దపల్లి, వెలుగు: హమాలీ కార్మికులు దేశానికి వెన్నెముక అని, దేశ నిర్మాణంలో వారి శ్రమ దాగి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. ఆదివారం పెద్దపల్లిలో నిర్వహించిన తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ దశాబ్ది ఆవిర్భావ వేడుకలకు మంత్రి వివేక్ తోపాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ విప్ విజయరమణారావు, రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ న్యాయం చేసేలా హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు మినిమం వేజెస్ బోర్డు పెంచిందని తెలిపారు. హమాలీలకు ప్రత్యేక రెస్ట్ రూమ్స్​నిర్మిస్తామన్నారు. కోవిడ్ లాగే ఎల్ నినోను ఎదుర్కోవాలని, విద్యుత్, తాగు, సాగు నీరును పొదుపుగా వాడాలని సూచించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ  జాతీయ హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ లో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.