
మంచిర్యాల: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. 42 వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికి చుక్క తాగు నీరు అందించలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుందని విమర్శించారు. మందమర్రి బీ1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు మంగళవారం (సెప్టెంబర్ 23) కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి వివేక్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించాడని విమర్శించారు. పదేండ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8లక్షల కోట్ల అప్పుకు నెలకు రూ.5 వేల కోట్ల వడ్డీ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం బీఆర్ఎస్ లీడర్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో కొచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్‌లో పాల్గొనకుండా చేసిందని.. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మందమర్రి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండేవని.. తానొచ్చాక 50 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేపట్టానని తెలిపారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించిందని ఆరోపించారు. అమృత్ స్కీంతో మందమర్రి ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యం కలుగుతుందని చెప్పారు.