- ఫైర్‌బ్రాండ్ ఈశ్వరీబాయి సేవలు మరువలేనివి:
- జేబీ రాజుకు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ప్రదానం
- యువత జేబీ రాజును రోల్ మోడల్‌గా తీసుకోవాలని పిలుపు
- ఘనంగా ఈశ్వరీబాయి 35వ వర్ధంతి సభ
హైదరాబాద్, వెలుగు: ఎవరెన్ని అణిచివేతలు సృష్టించినా అంబేద్కర్ ఎలాగైతే నిలబడి కొట్లాడారో.. నేటి యువత కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. దివంగత నేత ఈశ్వరీబాయి 35వ వర్ధంతి సభ మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గీతారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్, ఆల్ ఇండియా దళిత్ సేన అధ్యక్షుడు జేబీ రాజు, సినీ నటుడు గగన్ మాలిక్, ప్రముఖ గాయకుడు మాస్టర్జీతో కలిసి మంత్రి వివేక్ ఈశ్వరీబాయి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ అవార్డును జేబీ రాజుకు ప్రదానం చేశారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే సేవలు: వివేక్ వెంకటస్వామి ఈశ్వరీబాయి ఫైర్ బ్రాండ్ నేత అని, అసెంబ్లీలో తెలంగాణ గొంతుకగా నిలిచారని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. గీతారెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గీతారెడ్డి తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. వుమెన్ఎంపవర్ మెంట్ కోసం ఈశ్వరీ బాయి స్కూల్స్థాపించి పిల్లలకు చదువు నేర్పిస్తున్నారని పేర్కొన్నారు.
డబ్బు కోసం కాకుండా పేదలకు వైద్యం అందించేందుకు గీతా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారని ప్రశంసించారు. జేబీ రాజును తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా ఆయన వెళ్లేవారని, తమ నాన్న కాక వెంకటస్వామి చెప్పేవారని గుర్తు చేశారు.
జేబీ రాజును యువత రోల్ మోడల్‌గా తీసుకోవాలని, ఆయన టైమ్ మేనేజ్‌మెంట్, అంకితభావం ఆదర్శనీయమని సూచించారు. బౌద్ధ భిక్షువులు బుద్ధవనం వరకు పాదయాత్ర చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. బౌద్ధ బిక్షువులు చేపట్టిన దమ్మయాత్ర ప్రారంభానికి గుల్బార్గకు వెళ్లాలని, బుద్ధిజం అంటేనే ధైర్యం నేర్పిస్తుందన్నారు.
మినీ ట్యాంక్‌బండ్‌పై ఈశ్వరీబాయి విగ్రహం: గీతారెడ్డి
గీతారెడ్డి మాట్లాడుతూ తన తల్లికి జేబీ రాజు ప్రథమ శిష్యుడని తెలిపారు. ఈశ్వరీబాయి విగ్రహాన్ని మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని, అలాగే బుద్ధవనంలో అంబేద్కర్ విగ్రహంతోపాటు అమ్మ విగ్రహాన్ని కూడా పెడుతుండటం తమకు గర్వకారణమన్నారు. వివేక్ వెంకటస్వామి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల మంచి కోరే గొప్ప నాయకుడని, వారి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. వివేక్ చాలా ప్రత్యేకమని.. వారి కుటుంబం నుంచి ఒకరు మినిస్టర్, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు.
బుద్ధుడి బోధనలే శరణ్యం: గగన్ మాలిక్
సినీ నటుడు గగన్ మాలిక్ మాట్లాడుతూ.. తాను చేస్తున్న దమ్మ యాత్రకు మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన సహాయం గొప్పదని కొనియాడారు. ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చామన్నారు. ఈశ్వరీబాయి ఇలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారన్నారు. కార్యక్రమంలో గాయకుడు మాస్టర్ జీ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.
దళితులు, కార్మికుల పితామహుడు కాకా వెంకటస్వామి: జేబీ రాజు
కాకా వెంకటస్వామి దయాగుణం కలిగిన గొప్ప రాజకీయ నేత అని జేబీ రాజు కొనియాడారు. దళితులు, కార్మికులు, తెలంగాణ ప్రజలకు వెంకటస్వామి రాజకీయ పితామహుడు అని అభివర్ణించారు. ఆయన వారసత్వాన్ని వివేక్ కొనసాగిస్తున్నారని, ఇది హర్షించదగ్గ విషయమఃన్నారు. కాకా మాదిరిగానే వివేక్ వెంకటస్వామి కూడా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారని, ఆయనలో 100 యూనియన్లను నడిపిన శక్తి ఉందని ప్రశంసించారు.
