ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి రైతన్నలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.
ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగిందని.. జూన్ 6వ తేదీ వరకు చివరి గింజ వరకూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. గతంలో లక్షా 10 వేల టన్నుల కొనుగోళ్లు జరిగితే.. ఈసారి ఏకంగా లక్షా 70 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికోసం పెద్దపల్లిలో మూడు గోడౌన్లు కూడా అలాట్ చేశామని తెలిపారు. హమాలీల కొరత, లారీల కొరత వల్ల కొనుగోళ్లలో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమేనని, అందుకే సింగరేణి సంస్థను కూడా లారీలు సమకూర్చాలని కోరామని మంత్రి వివరించారు.
కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లోనే బాల్క సుమన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని షో చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ధర్నాల్లో రైతులు పాల్గొనడం లేదని, తానే స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నానని బాల్క సుమనే ఒప్పుకున్నాడని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ALSO READ : నీళ్లు వృథా చేసినందుకు రూ.10 వేల జరిమానా
గత ఎన్నికల్లో బాల్క సుమన్ ఏకంగా 100 కోట్లు ఖర్చు చేశాడని, ఆ వంద కోట్లు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలందరికీ తెలుసని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 100 కేసులు, వంద కోట్లు అంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన బాల్క సుమన్.. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
