శంషాబాద్‌‌‌‌లో కొత్త ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం : మంత్రి వివేక్ వెంకటస్వామి

 శంషాబాద్‌‌‌‌లో కొత్త ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • త్వరలోనే భూకేటాయింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్: మంత్రి వివేక్
  •     18 ఈఎస్ఐసీ డిస్పెన్సరీల నిర్మాణానికీ కేబినెట్ ఓకే 
  •     సనత్‌‌‌‌నగర్‌‌‌‌ ఈఎస్ఐలో కార్పొరేట్​కు దీటుగా అవయవ మార్పిడి  
  •     అంబేద్కర్‌‌‌‌ దూరదృష్టి వల్లే కార్మికులకు నేడు ఆరోగ్య భద్రత  
  •     ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవంలో కార్మిక శాఖ మంత్రి స్పీచ్

హైదరాబాద్, వెలుగు: కార్మికులకు వైద్య సేవలను మరింత విస్తరించేలా శంషాబాద్‌లో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్‌ జి.వివేక్‌ వెంకటస్వామి వెల్లడించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని త్వరలోనే కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే నిధుల లేమితో రద్దు అవుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే,18 ఈఎస్ఐసీ డిస్పెన్సరీల నిర్మాణానికి కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఈఎస్ఐలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా అవయవదాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సనత్‌నగర్‌ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, రీజినల్ డైరెక్టర్ రాజీవ్ లాల్‌ తో కలిసి మంగళవారం నిర్వహించిన ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ దూరదృష్టి వల్లే కార్మికులకు కనీస వేతనాలు, హక్కులు, ఈఎస్ఐ రూపంలో ఆరోగ్య భద్రత దక్కుతోందని స్పష్టం చేశారు. ఒకప్పుడు చెన్నూరులో కేవలం 50 పడకలతో ప్రారంభమైన చిన్న ఈఎస్ఐ ఆసుపత్రి, నేడు పూర్తిస్థాయిలో ఆధునిక వసతులతో సేవలందిస్తుండటం కార్మిక సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 

కార్పొరేట్ ఫీజుల భారం.. ఉచిత వైద్యమే వరం

దేశంలో కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో, సామాన్యుడికి అత్యవసరంగా అందాల్సినవి నాణ్యమైన విద్య, వైద్యం మాత్రమేనని మంత్రి వివేక్ పేర్కొన్నారు. సామాన్య కార్మికులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈఎస్ఐ లాంటి సంస్థలు అత్యుత్తమ వైద్య సేవలను అందించడం నిజంగా హర్షణీయమని, వైద్యులు కేవలం మందులివ్వడమే కాకుండా రోగికి మానసిక ధైర్యం కల్పించాలని ఆయన సూచించారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఎక్కడో ఒకచోట విమర్శలు వినిపించినా, ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలపై మాత్రం ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడం అక్కడి వైద్యుల అంకితభావానికి నిదర్శనమన్నారు. కార్మిక కుటుంబాలతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన తండ్రి గతంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖల మంత్రిగా విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా వివేక్ గుర్తు చేసుకున్నారు. గతంతో పోల్చుకుంటే ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నేడు మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులోకి రావడంతో సేవలు విస్తృతంగా మెరుగుపడ్డాయన్నారు. చిన్నపాటి జబ్బుల నుంచి గుండె ఆపరేషన్లు, అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సల వరకు అన్నీ ఒకే గొడుగు కింద ఈఎస్ఐ అందించడం వల్లే కార్మిక లోకం ధైర్యంగా తమ విధుల్లో పాల్గొనగలుగుతోందని వివరించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు ఏ సమయమైనా అండగా నిలిచేందుకు వీలుగా మరిన్ని ఆధునిక డిస్పెన్సరీలను, ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.