గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్​లో విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి వివేక్ సమాదానమిచ్చారు. రాష్ట్రంలో లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని, వీరికి ఇన్సింటివ్స్ ఇచ్చే అంశంపై ఇన్ టైమ్​లో డెలివరీ చేయాలని కంపెనీలు చెప్పటం.. వర్కర్లు చేయలేకపోతుండడంతో ఇన్సెంటివ్​లు రావటం లేదని మంత్రి పేర్కొన్నారు. వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంపెనీల నుంచి కొంత శాతం అమౌంట్​ను సెస్ రూపంలో వసూలు చేసి గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. 

వర్కర్ల పూర్తి వివరాలు ఈ బోర్డులో నమోదవుతాయన్నారు. స్పందించిన విప్ యెన్నం ఈ చట్టం తీసుకొస్తున్నందుకు సీఎంకు, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల నుంచి యువకులు వలస వచ్చి గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని, వారికి సాలరీ స్లిప్ ఉండదని దీంతో బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని కంపెనీలు టార్గెట్లు విధిస్తున్నాయని, ట్రాఫిక్​లో డెలివరీలు చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారని యెన్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వికారాబాద్​లో జరిగిన డీసీసీ మీటింగ్​లో గిగ్ వర్కర్ల అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారని విప్ బీర్ల ఐలయ్య గుర్తుచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.