వాళ్లు శంకుస్థాపనలకే పరిమితం.. మేం పనులు చేస్తం: వివేక్ వెంకటస్వామి

వాళ్లు శంకుస్థాపనలకే పరిమితం.. మేం పనులు చేస్తం: వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో శంకుస్థాపనలకే పరిమితమైందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్​ప్రజా పాలన ప్రభుత్వంలో మాత్రం కేవలం రెండేండ్లలోనే అద్భుతమైన అభివృద్ధి చేసి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నదని పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్​పేట అంబేద్కర్ నగర్​లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్​ఏరియాలో  కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. డివిజన్ లో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా?  అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమై.. వాస్తవానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు కేవలం నామమాత్రంగానే ప్రకటించారని తెలిపారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను కేవలం రెండేండ్లలో పూర్తిచేసి తమ నిజాయతీని ప్రజల ముందు నిలబెట్టుకున్నామన్నారు. పదేండ్లలో చూడని అభివృద్ధిని గత కొద్దికాలంలోనే తాము చేసి చూపిస్తున్నామని ప్రజలు బహిరంగంగా తమకు తెలియజేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

జూబ్లీహిల్స్​లో గెలుస్తం

రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధి తమను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తుందని  వివేక్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ఉ ప ఎన్నిక విషయానికొస్తే ఎంతోకాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలను కోట్ల రూపాయలు వెచ్చించి పరిష్కరించామన్నారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై అనేక సర్వేలు నిర్వహించి వారి పేర్లను హైకమాండ్ కు పంపించామన్నారు. అధిష్టానం ఎవరి పేరు సూచించినా.. అభ్యర్థి గెలుపు కోసం నాయకత్వం మొత్తం కలిసి పనిచేస్తుందన్నారు. తనకు ఏదైనా పని అప్పజెపితే దానిని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేవరకు పనిచేసే అలవాటు తనకు ఉందని.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే వరకు నిద్రపోకుండా పనిచేస్తానని మంత్రి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ కూడా తమదేనని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు.

కాకా స్ఫూర్తితో సేవ చేస్త

శనివారం సాయంత్రం ఫిలింనగర్ లోని ఎంజీ నగర్​లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పర్యటించారు. అక్కడ మాజీ మంత్రి పీజేఆర్​  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుమారు రూ. 1.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. కాలనీలో సమస్యల పరిష్కారం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని, కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు.