- ‘కాకా టోర్నమెంట్’ ద్వారా ఉత్తమ క్రికెటర్స్ గా ఎదగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఘనత కాకాదే
- ఉప్పల్ లో క్రికెట్ స్టేడియానికి అంకురార్పణ చేసిందీ వెంకట స్వామేనని వెల్లడి
- అలుగునూరులో కాకా వెంకట స్వామి మెమోరియల్ టీ -20 లీగ్ ఫైనల్ మ్యాచ్
- మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి హాజరు
- హుస్నాబాద్‌లో క్రికెట్ స్టేడియానికి సహకరిస్తా: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు: టాలెంట్ఉన్న క్రికెటర్లు జిల్లాల్లో ఎంతో మంది ఉన్నారని.. వారంతా బయటకు రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా పేరు మీద నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఉత్తమ క్రికెటర్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ అలుగునూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం కరీంనగర్,- రాజన్న సిరిసిల్ల జట్ల మధ్య కాకా వెంకట స్వామి మెమోరియల్ టీ -20 లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.
తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని.. టాలెంట్ ఉన్న క్రికెటర్లు జిల్లాల్లో చాలా మంది ఉన్నారని అప్పుడే గుర్తించామని చెప్పారు. ‘మొన్న మేము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకట స్వామి టోర్నమెంట్ నిర్వహించినప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా చేస్తే బాగుంటుందన్నారు. వాళ్లందరూ కోరడం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్షిప్ కోసం టెండర్ ఇవ్వడంతో విశాక ఇండస్ట్రీస్ ద్వారా ముందుకొచ్చాం. మా నాన్న కాకా వెంకటస్వామి స్పోర్ట్స్ ను డెవలప్ చేయాలని, రాష్ట్రంలో స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేవారు. ఉప్పల్ లో క్రికెట్ స్టేడియానికి అంకురార్పణ చేసిందీ వెంకట స్వామే. నన్ను ఆ రోజుల్లో ఫోర్స్ చేసి విశాక ఇండస్ట్రీస్ తరఫు నుంచి రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియానికి స్పాన్సర్ చేయించారు. అలాగే, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి చిందంబరంతో కొట్లాడి బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకొచ్చారు. బీసీసీఐ ఫైనాన్షియల్ గా అంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆ రోజుల్లో కాకా వెంకటస్వామి కాంట్రిబ్యూషనే కారణం. స్పోర్ట్స్ విషయంలో నా తండ్రి కాకా బాటలోనే నేను ప్రయాణిస్తున్నాను’ అని మంత్రి వెల్లడించారు.
ప్రతిభ కలిగిన క్రికెటర్లను వెలికితీయడం సంతోషకరం: మంత్రి పొన్నం
రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రికెటర్లను వెలికితీయడానికి కాకా వెంకట స్వామి పేరిట టోర్నమెంట్నిర్వహించడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో హర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్, అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ తెలంగాణ కీర్తిని దేశానికి చాటారని.. ఇప్పుడు సిరాజ్, తిలక్ వర్మ లాంటి వారు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. ఉప్పల్ స్టేడియం మాదిరిగా కరీంనగర్ లోనూ స్టేడియం కోసం స్థలం మంజూరుతోపాటు నిర్మాణానికి సహకరిస్తామని, హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే 20 ఎకరాల స్థలం ఇస్తానని, అక్కడ అద్భుతమైన స్టేడియం నిర్మించే బాధ్యత హెచ్ సీఏ, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ తీసుకోవాలని మంత్రి కోరారు. కాకా వెంకటస్వామి లెగసీని వివేక్ వెంకటస్వామి ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు.
తిలక్ వర్మ.. టోర్నీ ప్రొడక్టే..
ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యుడు తిలక్ వర్మ కాకా వెంకటస్వామి టీ 20 లీగ్ నుంచే క్రికెట్లో అరంగేట్రం చేశారని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగం రావు గుర్తు చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చైర్మన్ కొరివి వేణుగోపాల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు. కాగా, మ్యాచ్‌కు ముందు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్, బౌలింగ్ చేశారు.
