హైదరాబాద్, వెలుగు: కర్నాటక గుల్బార్గాలోని బుద్ధ విహార్‌ను సందర్శించి, బుద్ధుడిని దర్శించుకోవడం తన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను బుద్ధిస్ట్ కాకున్నా బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నానని తెలిపారు. గుల్బర్గాలోని బుద్ధ విహార్ నుంచి తెలంగాణలోని నాగార్జునసాగర్ బుద్ధవనం వరకు మూడోసారి బౌద్ధ బిక్షువులు దమ్మ యాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆదివారం కర్నాటకలోని గుల్బర్గాలోని బుద్ధ దేవాలయంలో బుద్ధుడిని మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. అనంతరం 3వ బౌద్ధ దమ్మ యాత్రను ప్రారంభించి, మాట్లాడారు. గుల్బర్గాలోని సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి తెలంగాణలోని నాగార్జునసాగర్ బుద్ధవనం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. ఈ యాత్ర తెలంగాణకు చేరుకోగానే తానే స్వయంగా బౌద్ధ బిక్షువులతో కలిసి యాత్రలో పాల్గొంటానన్నారు. దేశంలో శాంతి అనేది చాలా అవసరమని, ఇలాంటి సమయంలో ఈ దమ్మ యాత్ర చాలా గొప్ప విషయమన్నారు. ప్రేమ, శాంతి, కర్మ, సందేశంతో ముందుకు సాగుతున్న బుద్ధిజాన్ని మనం అందరం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
