
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై తెలంగాణ ప్రజలకు వివరించేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు జన సమీకరణపై ఇన్‌చార్జ్ మంత్రులు కసరత్తు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ సభను ఏర్పాటు చేయడం, పీసీసీ చీఫ్‌గా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్‌కు అభినందన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ఈ సభ సక్సెస్ కోసం ఇన్‌చార్జ్ మంత్రులు వరుస మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఆ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌లు సమావేశమై జన సమీకరణపై చర్చించారు. గురువారం మధ్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్‌లో వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొని కామారెడ్డి సభకు జన సమీకరణపై చర్చించారు.
కనీసం లక్ష మందికి తగ్గకుండా ప్రజలను కామారెడ్డి సభకు తరలిరావాలని పీసీసీ నిర్ణయించడంతో ఆ దిశగా జిల్లాల వారిగా ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి సభ ద్వారా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించడం, అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పార్టీ చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రజలకు వివరించనున్నారు. అలాగే, బీసీ బిల్లుకు అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ తీరును జనంలో ఎండగట్టనున్నారు.