ఆపరేషన్  గురుకులాలు..కదిలిన రాష్ట్ర ప్రభుత్వం

ఆపరేషన్  గురుకులాలు..కదిలిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయం నుంచి గురుకుల పాఠశాలల్లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు రెయిడ్స్ నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతను పరిశీలించారు. ఇదే సమయంలో అటు మంత్రులు కూడా గురుకులాల బాట పట్టారు. జగిత్యాల జిల్లాపెద్దాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి సందర్శించారు. ఇటీవల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు నలుగురు అస్వస్థతకు గురయ్యారు.

మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ములుగు గురుకుల పాఠశాల మూడో అంతస్తు పై నుంచి పడి నడుం విరగడంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి కార్తీక్ ను మంత్రి సీతక్క పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో అధికారుల తనిఖీలు జరిగాయి. ఈ సందర్బంగా ఎక్స్పైరీ అయిన ఆహారపదార్థాలను అధికారులు గుర్తించారు. అందుకే తరుచూ ఫుడ్ పాయిజన్స్ జరుగుతున్నాయని తెలిపారు. వీటితోపాటు బాత్రూంలు సరిగా లేకపోవడంతో అపరిశుభ్రత పెరిగి దోమలు విజృంభిస్తున్నాయని గుర్తించారు. వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.