ఐక్యంగా పోరాడుదాం.. బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం : ధర్నాలో మంత్రుల పిలుపు

 ఐక్యంగా పోరాడుదాం.. బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం : ధర్నాలో మంత్రుల పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఐక్యంగా పోరాటం చేద్దామని రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్‌‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రులు మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన బిల్లులను కేంద్రం ఆమోదించడం లేదని మండిపడ్డారు. బిల్లులను ఆమోదించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 

బిల్లులను ఆమోదించే వరకూ పోరాటం ఆగదు 

బీసీ బిల్లులకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ.. ఆ బిల్లులు ఢిల్లీకి చేర‌గానే వ్యతిరేకిస్తున్నది. నాలుగు నెలలుగా బీసీ బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. బీసీలైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి బండి సంజ‌య్..  బీసీలకు మేలు చేసే ఈ బిల్లులపై ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ ఎంపీ పదవి ఇవ్వగానే ఆర్.కృష్ణయ్య గొంతు మూగబోయింది. బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపే వరకూ మా పోరాటం ఆగ‌దు. తన ఉనికి కోసమే కవిత బీసీ ఉద్యమ నినాదం ఎత్తుకున్నది. బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం ఆమె చేసిన ధ‌ర్నా పెద్ద జోక్.  - కొండా సురేఖ‌

బీసీలకు న్యాయం చేసేందుకే 

బీసీ రిజ‌ర్వేష‌న్లు ఎవ‌రికీ వ్యతిరేకం కాదు. అన్ని రంగాల్లో బీసీల‌కు న్యాయం చేయ‌డం కోసమే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి రాష్ట్రప‌తికి పంపించాం. బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించుకునే వ‌ర‌కు అందరం కలిసి ఐక్యంగా పోరాడుదాం. - పొన్నం ప్రభాకర్

ఇదే సరైన సమయం

బీసీ రిజ‌ర్వేష‌న్లకు అన్ని వ‌ర్గాల నాయ‌కులు మ‌ద్దతు తెలుపుతున్నారు. మ‌న హ‌క్కుల కోసం మ‌న‌మే పోరాడాలి. తెగించి పోరాడితే త‌ప్ప రిజ‌ర్వేష‌న్లు సాధించ‌లేం. ఇప్పడు కాకుంటే.. ఇంకెప్పడూ కాదు. ‘ఔర్ ఏక్ ధ‌క్కా.. 42 ప‌ర్సంటేజ్ ప‌క్కా’. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీ నేత‌లు.. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్రలో ముస్లింలకు ఎందుకు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు. బీసీ రిజ‌ర్వేష‌న్లకు ఎవ‌రు అడ్డుప‌డినా వాళ్లకు గ‌డ్డుకాలం త‌ప్పదు. ‌‌- వాకిటి శ్రీహ‌రి

బిల్లులు ఆమోదించేదాకా కేంద్రాన్ని వదలం.. 

బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లు అడిగితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది. బీసీ బిల్లులను ఆమోదించేదాకా కేంద్రాన్ని వదలిపెట్టం. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు న్యాయపరమైన చిక్కులుంటే, ఈడ‌బ్ల్యూఎస్ కింద 10 శాతం రిజ‌ర్వేష‌న్లు ఎలా అమలు అవుతున్నాయో కేంద్రం చెప్పాలి. బీసీలు తయారు చేసిన కుర్చీలో బీజేపీ కూర్చుంది. కానీ బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.        - ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి

కేంద్రం ఇకనైనా కళ్లు తెరవాలి 

కులగణన చేపట్టి బీసీ బిల్లులు తెచ్చాం. ఆ బిల్లుల‌ను ఆమోదించాల‌ని రాష్టప‌తికి పంపాం. కానీ నాలుగు నెల‌లవుతున్నా కేంద్రం స్పందించ‌డం లేదు. బిల్లుల ఆమోదం కోసం పార్టీలు, కులాలకు అతీతంగా ధర్నా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా క‌ళ్లు తెర‌వాలి. మా ఆవేద‌న‌ను, నిబద్ధత‌ను అర్థం చేసుకోవాలి. క‌చ్చితంగా ఈ ధ‌ర్నా ఫ‌లితం ఇస్తుంద‌ని భావిస్తున్నాం. - దామోదర రాజనర్సింహ 

మోదీ.. బీసీల వ్యతిరేకి 

ప్రధాని మోదీ నరనరాన బీసీ వ్యతిరేక భావజాలం ఉంది. మోదీ పేరుకే బీసీ.. ఆయ‌న డీఎన్‌ఏలో బీసీ వ్యతిరేకతే ఉంది. పీఎంవోలో వెనుకబడిన వర్గాలకు చెందిన అధికారులే లేరు. ఓట్ల కోసం కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప.. సామాజిక న్యాయం కోసం బీజేపీ ఎప్పుడూ పని చేయలేదు. బీసీలను వ్యతిరేకించే బీజేపీని ఊళ్లలోకి రాకుండా తరిమికొట్టాలి.- సీతక్క

కేంద్రం ఇకనైనా దిగిరావాలి.. 

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని భార‌త్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టారు. బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ బిల్లుల‌ను రాష్ట్రప‌తికి పంపాం. కానీ వాటిని కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. ఈ విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీ వేదిక‌గా ధ‌ర్నా చేస్తున్నాం. కేంద్రం ఇప్పటికైనా దిగివ‌చ్చి బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు చొర‌వ చూపాలి.                      - అడ్లూరి లక్ష్మణ్ 


బీజేపీపై ఒత్తిడి తెస్తం

బీసీలకు న్యాయం జరిగే విధంగా బీజేపీపై ఒత్తిడి తెస్తాం. బీసీ బిల్లులను ఆమోదించాలని కోరేందుకు రాష్ట్రప‌తి అపాయింట్‌మెంట్ అడిగినం.. స‌మ‌యం ఇస్తార‌ని ఆశిస్తున్నాం. ఈ ధర్నాతో అయినా ఓబీసీల విష‌యంలో ఒక‌ మార్గం చూపాల‌న్న నిర్ణయాన్ని బీజేపీకి రాష్ట్రప‌తి తెలియ‌జేస్తార‌ని ఆశిస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బలహీన వర్గాల కోసం మొసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లులు తెచ్చిన కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హ‌క్కు ఆ పార్టీకి లేదు.  
‌‌- శ్రీధర్ బాబు

బీజేపీ మెడలు వంచుతం

కులగణన లెక్కల ఆధారంగా బీసీల‌కు 42 శా రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ బిల్లులను కేంద్రానికి పంపించాం. కానీ అవి నాలుగు నెల‌లుగా రాష్ట్రప‌తి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెడ‌లు వంచి, బీసీ బిల్లులను ఆమోదించుకునేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగంలో ద‌ళితులు, గిరిజ‌నుల‌ రిజ‌ర్వేష‌న్లు పొందుపరిచారు. కానీ ఓబీసీల‌కు మాత్రం ఆ హ‌క్కులు క‌ల్పించ‌లేదు. ఈ విష‌యాన్ని గుర్తించిన రాహుల్... కులగణన చేపట్టి, జ‌నాభా ప్రాతిపదిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంత‌మైన సామాజిక న్యాయం కోసం ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతాం. - ఉత్తమ్ కుమార్ రెడ్డి