గవర్నర్​ను ఖదర్​ చేస్తలే

గవర్నర్​ను ఖదర్​ చేస్తలే
  • తమిళిసై పాల్గొనే కార్యక్రమాలన్నిటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా
  • యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్​ను ఆహ్వానించలే
  • వరంగల్​లో​ సంస్కృతీ ఉత్సవాలకు సాంస్కృతిక సారథి కళాకారులూ పోలే
  • చెంచు గూడాల పర్యటనలకు ఒక్కరూ హాజరు కాలె
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డినీ ప్రోగ్రామ్​లకు పిలుస్తలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళిసైతో రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మరింత పెరిగింది. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొనే ఏ కార్యక్రమానికి కూడా రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులెవరూ హాజరుకావడం లేదు. రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే నుంచి యాదాద్రి గుడి ప్రారంభం వరకు అన్నింటా గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగానే ఉంటున్నారు. తాజాగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జాతీయ సంస్కృతీ మహోత్సవాలకు మన రాష్ట్ర కళాకారులు డుమ్మా కొట్టారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కనీస సహకారం కూడా అందించలేదు. శనివారం జరిగే ఉగాది వేడుకలనూ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేర్వేరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే కాదు రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రిగా ఉన్న కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డితోనూ రాష్ట్ర సర్కారు దూరం పాటిస్తున్నది.  

సంస్కృతీ మహోత్సవాలకూ దూరం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్రం ‘ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళ, బుధవారాల్లో జాతీయ సంస్కృతీ మహోత్సవాలు నిర్వహించారు. తొలిరోజు గవర్నర్ తమిళిసై హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో ఆడిపాడారు. రెండో రోజు ముగింపు ఉత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అతిథిగా వచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరూ రాలేదు. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాగతం పలకాల్సి ఉన్నా పలకలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాల్లో అన్నీ తామై సందడి చేసే సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్రంలో జరిగే జాతీయ ఉత్సవాలకు డుమ్మా కొడుతున్నారు. ఈ సంస్కృతీ ఉత్సవాలు శుక్ర, శని, ఆదివారం హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో జరుగనున్నాయి. వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. 

పిలుస్తలేరు.. పోతలేరు
యాదాద్రి ఆలయ ప్రారంభానికి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి గవర్నర్​ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశాలను నిర్వహించింది. ఇటీవల నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలోని చెంచుపెంటను గవర్నర్‌‌  సందర్శించినప్పుడు కూడా టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లలేదు. ఆ మధ్య మేడారం జాతరకు గవర్నర్ వెళ్లేందుకు హెలికాప్టర్‌‌ ఇవ్వాలని రాజ్‌‌భవన్‌‌ సెక్రటేరియట్‌‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఒక్కటే హెలికాప్టర్‌‌ ఉందని, సీఎం వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదని సర్కారు పేర్కొంది. దీంతో గవర్నర్‌‌ రోడ్డు మార్గాన మేడారం వెళ్తే అప్పటివరకు అక్కడే ఉన్న మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌‌ రెడ్డి ఉన్నట్టుండి మాయమయ్యారు. గవర్నర్‌‌కు ప్రొటోకాల్‌‌ ప్రకారం స్వాగతం పలకాల్సిన ములుగు కలెక్టర్‌‌, ఎస్పీ కూడా కనిపించలేదు. ములుగు కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క గవర్నర్‌‌కు స్వాగతం పలికి.. వన దేవతల దర్శనం చేయించారు. కరోనా కారణంగా రిపబ్లిక్‌‌ డే వేడుకలను రాజ్‌‌భవన్‌‌లో నిర్వహించాలని కేబినెట్‌‌ తీర్మానించింది. కానీ ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున సీఎం కాదు కదా ఒక్క టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. 

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డినీ ఆహ్వానిస్తలే 
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకొని వస్తామని రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌‌లో మంత్రిగా ఉన్న కిషన్‌‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా కలువలేదు. గతంలోనూ ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులను మినహా కిషన్‌‌ రెడ్డిని కలువలేదు. ఇటీవల ఆయన హైదరాబాద్‌‌లో పర్యటించినప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవ్వరూ వెళ్లలేదు. సికింద్రాబాద్‌‌ లోక్​సభ నియోజకవర్గం పరిధిలో చేసే కార్యక్రమాలకు అక్కడి నుంచి ఎంపీగా ఉన్న కిషన్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా ఆహ్వానించడం లేదు.

ఉగాది ఉత్సవాలు వేర్వేరుగానే..
ఏటా రాజ్‌‌భవన్‌‌లో నిర్వహించే ఉగాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు హాజరవడం ఆనవాయితీ. అయితే ఈసారి వేడుకలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరూ వెళ్లడం లేదని తెలుస్తున్నది. శనివారం జరిగే ఉగాది వేడుకలనూ రాజ్‌‌భవన్‌‌, ప్రగతి భవన్‌‌లో వేర్వేరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.