
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ మంత్రలు స్పందించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే కవితకు నోటీసులిచ్చారని ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజునే కవితకు నోటీసులిచ్చి మహిళను అవమానించారని విమర్శించారు.
మోడీకి రోజులు దగ్గరపడ్డయ్: జగదీష్ రెడ్డి
కవితకు ఈడీ నోటీసులివ్వడం మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ప్రజల కోసం పని చేసే నేతలకు జైళ్లు, కేసులు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడు లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.. మోడీ దురాగాతలపై ప్రశ్నిస్తున్న కేసీఆర్ పై మోడీ కుట్రలో భాగంగానే కవితకు నోటీసులిచ్చారని ఆరోపించారు. బీజేపీ అణచివేత దోరణితో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందన్నారు.
ఎన్ని వేషాలు వేసినా భయపడం: ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
ఈడీ బోడీలను అడ్డుపెట్టుకుని కేంద్రం ఎన్ని వేషాలు వేసిన భయపడబోమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమైతే బీజేపీకి వెన్నులో వణుకుపుట్టిందని...అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు . కేంద్ర వేధింపులకు భయపడబోమని చెప్పారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలరకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలు బీజేపీ పతనానికి నాంది అని అన్నారు.
టార్గెట్ చేసిన్రు: గంగుల
బీఆర్ఎస్ ను కేంద్రం టార్గెట్ చేసిందని మంత్రి గంగుల అన్నారు. మహిళా దినోత్సవం రోజునే కవితకు నోటీసులిచ్చారని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కేంద్రం తెలంగాణపై కక్ష కట్టిందని అన్నారు. కవితను అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ముందే చెప్పారని గుర్తు చేశారు.