ఆగస్టు 22 నుంచి ఉపాధిపనుల జాతర .. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులు

ఆగస్టు 22  నుంచి ఉపాధిపనుల జాతర .. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులు
  • పంచాయ‌‌‌‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహణ
  • మహబూబాబాద్‌‌‌‌ జిల్లా పుట్టలభూపతి గ్రామంలో ప్రారంభించ‌‌‌‌నున్న మంత్రి సీత‌‌‌‌క్క
  • రూ.2199 కోట్లతో లక్షకుపైగా పనులకు శ్రీకారం
  • ‘ప‌‌‌‌నుల జాత‌‌‌‌ర‌‌‌‌’ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించిన మంత్రులు సీత‌‌‌‌క్క, లక్ష్మణ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : గ్రామీణాభివృద్ధి, ఉపాధి, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పనుల జాతర 2025’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే సారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజ‌‌‌‌య‌‌‌‌వంతం చేయాల‌‌‌‌ని కోరుతూ మంత్రి సీత‌‌‌‌క్క ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా లెటర్లు సైతం రాశారు.

 పనుల జాతరకు సంబంధించిన పోస్టర్లను గురువారం సెక్రటేరియట్‌‌‌‌లో మంత్రులు సీతక్క, లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌, పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌‌‌‌ శ్రీజన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్‌‌‌‌ మిషన్‌‌‌‌, పంచాయతీరాజ్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ విభాగం, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. పనుల జాతర కార్యక్రమాన్ని మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టలభూపతి గ్రామంలో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. 

రూ.2,199 కోట్లతో లక్షకుపైగా పనులు

ప‌‌‌‌నుల జాత‌‌‌‌ర‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ. 2,199 కోట్లతో 1,01,589 పనులను చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌ విధించింది. పనుల జాత‌‌‌‌రతో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్‌‌‌‌ మిషన్‌‌‌‌ (గ్రామీణ్), పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి కీలక విభాగాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులను ప్రారంభించనున్నారు. 

ఉపాధి నిధుల ద్వారా ‘ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా’ కింద పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కాంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాల నిర్మాణం, పొలం బాటలు, నర్సరీల పెంపకం, జలనిధి పథకం కింద చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లు, ఊట కుంటల నిర్మాణాలు చేపట్టనున్నారు. 

స్వచ్ఛ భారత్‌‌‌‌ మిషన్‌‌‌‌ కింద ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ యూనిట్లు, సెగ్రిగేషన్‌‌‌‌ షెడ్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌‌‌‌లు, గ్రామీణ రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, అంగన్‌‌‌‌వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి పనులను చేపడతారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టాల్సిన వివిధ పనుల జాబితాను డీఆర్డీవో ఆఫీసర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 

పనుల జాతరలో భాగంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతేడాది న‌‌‌‌వంబ‌‌‌‌ర్‌‌‌‌ 26న పనుల జాతర విజయవంతంగా నిర్వహించగా.. రూ. 4,529 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కార్యక్రమమే చేపడుతుండడంతో పల్లెల్లో మరోసారి అభివృద్ధి పండుగ వాతావరణం నెలకొననుంది. 

రాజకీయాలకతీతంగా భాగస్వాములు కావాలి :మంత్రి సీతక్క

 ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణాభివృద్ధికి ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలవనుంది. ఇది రాజకీయాలకు అతీతమైన పండుగ. ఈ పనుల జాతరలో ఎమ్మెల్యేలంతా పాలుపంచుకోవాలి. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా లెటర్లు రాశాం. ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలి. 

పల్లెల్లో ఉపాధి అవకాశాలను పెరగడమే కాకుండా, జల సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదలకూ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పల్లెల్లో నిజమైన అభివృద్ధి పండుగ జరగనుంది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.