మైనారిటీలకూ రూ. లక్ష సాయం..నిబంధనలు ఇవే

 మైనారిటీలకూ రూ. లక్ష సాయం..నిబంధనలు ఇవే

రాష్ట్రంలో పేద మైనారిటీలకు రూ.  లక్ష  ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వంద శాతం పూర్తి సబ్సిడీతో మైనారిటీ బంధు అందచేయాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అన్ని వర్గాల పేదలకు ఆర్థిక సాయం..

రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోందని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.  విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ  మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తోందన్నారు.  భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నిబంధనలు ఇవే..

  • మైనారిటీలకు రూ. లక్ష సాయంపై  మైనారిటీల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ జీఓ నంబర్ 78ను జారీ చేశారు.
  • వందశాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మైనారిటీలకు అందజేస్తుంది. 
  • ఇది వన్ టైమ్ గ్రాంట్. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థికసాయం అందుతుంది.
  • దరఖాస్తు చేయాలనుకునే వారి వార్షిక ఆదాయం .. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణాల్లో రూ. 2 లక్షలకు మించి ఉండకూడదు. 
  • తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం 
  • ఎంపిక చేసిన వారి జాబితాను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది ప్రభుత్వం.