
చినుకులు పడే వేళ.. వేడి వేడిగా పకోడీలు తినాలనిపించడం చాలా కామన్. ఈ సీజన్లో ఒక్కసారైనా ప్రతి ఇంట్లో ఉల్లిపాయ పకోడీలు వేసుకోవడం కూడా అంతే నేచురల్. కానీ, కాస్త వెరైటీగా తినాలంటే మాత్రం ఇవి ట్రై చేయాల్సిందే. నాన్ వెజ్ ప్రియులకు రొయ్యలు, వెజ్ లవర్స్‌కి పనీర్.. ఏదైనా పర్లేదు ఫ్లేవర్ ఫుల్‌గా కావాలంటే మింట్, కాజూ కాంబినేషన్ అదిరిపోతుంది. మరింకేం.. మూడు వెరైటీలు ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివేయండి.
కావాల్సినవి :
శనగపిండి – రెండు కప్పులు
బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీస్పూన్
కారం – మూడు టీస్పూన్లు
ఇంగువ, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్
వేడి నూనె – పావు కప్పు, జీడిపప్పు – ఒక కప్పు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా
పుదీనా – జీడిపప్పు
తయారీ : ఒక మిక్సీజార్‌లో పుదీనా, కొత్తిమీర వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ వేసి బాగా కలపాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసి మరోసారి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేయాలి. ఆ నూనెని పిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి, నీళ్లు పోసి బాగా కలపాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసి రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమంలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని పకోడీల్లా వేయాలి.
రొయ్యల పకోడీ
కావాల్సినవి :
రొయ్యలు – 300 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు
కారం – రెండు టీస్పూన్లు, గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్ – ఒక్కో టీస్పూన్
నిమ్మరసం – అర టీస్పూన్
నీళ్లు, ఉప్పు – సరిపడా
తయారీ : ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, కారం, గరం మసాలా, నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. రొయ్యలు కూడా వేసి కలపాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసి అందులో రొయ్యల్ని వేసి వేగించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి.
పనీర్‌తో
కావాల్సినవి :
పనీర్ – అర కిలో
శనగపిండి, బియ్యప్పిండి, మైదా – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, ఇంగువ – పావు టీస్పూన్, వాము, పసుపు, నిమ్మరసం – ఒక్కోటి అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం – ఒక్కో టీస్పూన్, ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా, ఆమ్చూర్ పొడి – కొంచెం
తయారీ : ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, మైదా, వాము, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. ఒక ప్లేట్లో పనీర్ ముక్కలు వేసి ఉప్పు చల్లాలి. వాటిని రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో పనీర్ ముక్కలు వేసి వేగించాలి. వాటిని ప్లేట్లోకి తీసుకుని, ఆమ్ చూర్ పొడి చల్లుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.