తెలంగాణలో భారీగా పడిపోయిన మిర్చి సాగు... ఈ ఏడాది సగం కూడా సాగుకాలే !

తెలంగాణలో భారీగా పడిపోయిన మిర్చి సాగు... ఈ ఏడాది సగం కూడా సాగుకాలే !
  • గత సీజన్‌‌లో 2 లక్షల ఎకరాలు సాగైతే.. ప్రస్తుతం 95 వేల ఎకరాలే...
  • పెట్టుబడి పెరగడం, దిగుబడి, ధర తగ్గడమే కారణమంటున్న రైతులు
  • అక్టోబర్‌‌ చివరితో ముగియనున్న సీజన్‌‌


మహబూబాబాద్, వెలుగు : రాష్ట్రంలో మిర్చి సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ సాగు చేసేందుకు రైతులు మాత్రం ముందుకు రావడం లేదు. గత సీజన్‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు పైగా మిర్చి తోటలు సాగు కాగా.. ప్రస్తుత సీజన్‌‌లో అందులో సగం విస్తీర్ణం కూడా సాగు జరగలేదు. మిర్చి సాగు చేసేందుకు అక్టోబర్‌‌ చివరి వరకు మాత్రమే అనువైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పటివరకు కేవలం 95,561 ఎకరాల్లోనే మిర్చి సాగు జరిగింది. సీజన్‌‌ ముగిసేందుకు మరికొన్ని రోజులే ఉన్నప్పటికీ మిర్చి సాగుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదు.

పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులు

మిర్చిసాగు తగ్గిపోవడానికి పెట్టుబడులు పెరగడమే కారణంగా తెలుస్తోంది. మిర్చి సాగు చేసిన నాటి నుంచి పంటను తెంపడం, ఆరబెట్టడం, మార్కెట్‌‌కు తరలించి విక్రయించడం వరకు ఇంటిల్లిపాది పనిచేయాల్సి ఉంటుంది. మిర్చి విత్తనాలు, అడుగు మందులు, చీడపీడల నివారణ కోసం వాడే క్రిమిసంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. కూలీ ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో ఒక ఎకరంలో మిర్చి సాగు చేయాలంటే రూ. 1.80 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. పంటకు వివిధ రకాల చీడపీడలు,పేను బంక, గండు పురుగు, నల్ల తామర వంటి తెగుళ్లు సోకుతుండడంతో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుంది. చేతికొచ్చిన పంటనైనా మార్కెట్‌‌లో అమ్ముదామంటే సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. 

క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడుతున్నారన్న కారణంతో తెలుగు రాష్ట్రాల్లో పండించిన మిర్చికి ఆసియా దేశాల్లో డిమాండ్ తగ్గిపోయింది. చైనా, ఇజ్రాయిల్‌‌, పాకిస్తాన్‌‌తో పాటు పటు దేశాల్లో మిర్చి సాగు పెరగడం, అక్కడ కూలీలు, ఇతర ఖర్చులు తక్కువ కావడంతో పంటను తక్కువ ధరకే అమ్మేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఏపీలోనే ఎక్కువ మిర్చి సాగుజరుగగా.. గత నాలుగేండ్ల నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌, అసోం, బీహార్‌‌ వంటి రాష్ట్రాల్లోనూ మిర్చి సాగు పెరిగింది. ఈ క్రమంలో గతంలో రూ.32 వేలు పలికిన క్వింటాల్‌‌ మిర్చి ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 15 వేల మధ్యే పలుకుతోంది. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్న రైతులు

మిర్చి సాగు తగ్గించుకుంటున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. నీటి వసతి ఎక్కువగా ఉన్న రైతులు వరి సాగు చేస్తుండగా.    నీటి వసతి లేని వారు మక్కజొన్న, ఆయిల్‌‌పామ్‌‌, జామాయిల్‌‌, వేరుశనగతో పాటు వివిధ రకాల తోటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో కొద్దిమొత్తంలో మిర్చి సాగు జరుగగా.. ఆదిలాబాద్‌‌, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌‌ మల్కాజ్‌‌గిరి, నారాయణపేట జిల్లాల్లో అసలు మిర్చి సాగే మొదలు కాలేదు. 

పెట్టుబడి పెరగడంతో మిర్చి సాగు మానేశా 

మార్కెట్‌‌లో మిర్చికి తక్కువ రేటు పలుకుతుండడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. పురుగు మందుల వినియోగం, ఇతర పెట్టుబడులు పెరగడం, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గుతుండడంతో మిర్చి సాగు మానేశాను. ఐదేండ్లుగా ప్రతియేడు మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేసేది. ఈ సారి మక్కజొన్న సాగు చేశాను.     - దీకొండ కుమార్‌‌, రైతు, మాటేడు గ్రామం, తొర్రూరు మండలం