సింగరేణి ద్వారానే కొత్త గనులు తవ్వాలి: మిర్యాల రాజిరెడ్డి

సింగరేణి ద్వారానే కొత్త గనులు తవ్వాలి: మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు : తెలంగాణలో కొత్త బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా, సింగరేణి నిర్వహణలోనే తవ్వకాలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్‌‌‌‌ రాష్ట్ర స్టీరింగ్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ మిర్యాల రాజిరెడ్డి కోరారు. గోదావరిఖని ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో బుధవారం జరిగిన యూనియన్‌‌‌‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ వినియోగించే మెషీన్లు, పనిముట్లను తయారు చేసే కంపెనీలు నెలకొల్పేలా కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌ ఏరియా యువతను సింగరేణి సంస్థ ప్రోత్సహించాలని కోరారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కార్పొరేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ ప్రారంభించాలని, కార్మికులందరికీ మెడికల్‌‌‌‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌, సర్ఫేస్‌‌‌‌ విభాగాల్లో పని వేళలను మార్చాలని కోరారు. అనంతరం 14 తీర్మానాలను రాష్ట్ర ప్రతినిధులు ఆమోదించారు. సమావేశంలో యూనియన్‌‌‌‌ లీడర్లు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, పెట్టెం లక్ష్మణ్, వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, బడికల సంపత్, జాహిద్ పాషా పాల్గొన్నారు.