దోపిడీ, నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిందే 

  దోపిడీ, నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిందే 
  • తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్లంతా కేసీఆర్ దృష్టిలో ద్రోహులుగా మారారు

హనుమకొండ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ఇంజనీరింగ్ అధికారులు చెప్పినా.. కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసి ప్రజాధానం దుర్వినియోగం చేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. పాలకులే కాదు.. పాలన మారాల్సిన అవసరం వచ్చిందని..  దోపిడీ, నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై జరిగిన చర్చలో రిటైర్డ్ ప్రొఫెనర్ కూరపాటి వెంకటానారయణ, పింగిలి సంపత్ రెడ్డి, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్లంతా.. సీఎం కేసీఆర్ దృష్టిలో ద్రోహులుగా మారారని అన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని చెప్పిన లక్ష కోట్లు వృధాగా ఖర్చు చేసి  ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను చదివించుకునేందుకు సంక్షేమ హాస్టళ్లకు పంపితే.. పాడె కట్టి పంపిస్తున్నారని మండిపడ్డారు.