- ఆలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఘటన
చేవెళ్ల, వెలుగు: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు గ్రామంలో చోటు చేసుకుంది. చేవెళ్ల ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామానికి చెందిన హర్యానాయక్ (40) ఆలూరు గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
గురువారం విధుల్లో భాగంగా సబ్‌స్టేషన్‌లో ఉండగా రాత్రి 12.40 గంటలకు గ్రామానికి చెందిన వాటర్ లైన్మెన్ ఎల్లకొండ శ్రీనివాస్‌కు హర్యానాయక్ ఫోన్ చేసి ఇక్కడకు రావాలని, కొంత మంది నేపాల్ రాష్ర్టానికి చెందిన వ్యక్తులు నాతో గొడవ పడుతున్నారని తెలిపాడు.. ఎల్లకొండ శ్రీనివాస్‌కు గ్రామంలో జాతర ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వెంటనే సబ్ స్టేషన్‌కు వెళ్లలేదని, రాత్రి 2.30 గంటలకు వెళ్లి చూడగా హర్యానాయక్ రక్తపు మడుగుల్లో పడి మృతిచెంది ఉన్నాడని తెలిపారన్నారు.
ఎల్లకొండ శ్రీనివాస్ ఏఈ జానీమోమిదీన్‌కు సమాచారమివ్వడంతో చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. డబ్బుల కోసమే దుండగులు హత్య చేశారని విద్యుత్‌శాఖ అధికారులు, పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
