కట్టు..బొట్టుతో కట్టిపడేశారు!..ఉమ్మడి వరంగల్​ జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి

కట్టు..బొట్టుతో కట్టిపడేశారు!..ఉమ్మడి వరంగల్​ జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి
  • కాకతీయ శిల్ప, కళా సంపద చూసి ముచ్చటపడిన ముద్దుగుమ్మలు.. సెల్ఫీలు, ఫొటోలు
  • ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెంకటాపూర్‌‌(రామప్ప), వెలుగు : రామప్ప ఆలయ సోయగాలకు అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. కాకతీయ శిల్ప కళా సంపదను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుడిని తమ సెల్‌‌ఫోన్లలో బంధిస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడ్డారు. వరల్డ్ హెరిటేజ్ టెంపుల్‌‌గా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం 35 దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.

పట్టు చీరెలు, పట్టు లంగా ఓణి ధరించి.. తెలుగు సంప్రదాయంతో  మెరిసి మురిసిపోయారు. ముందుగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన ద్వారా ములుగు జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో గడిపి..  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత, చరిత్రను అధికారులు వివరించారు.  తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల ‘రాణి రుద్రమ’ నృత్యరూపకం ప్రదర్శించారు. రంజిత్ పేరణి నృత్య కళా బృందం పేరణి నృత్యం, 65 మంది పేరణి కళాకారులు శివతాండవం చేశారు. అనంతరం లైట్, సౌండ్ షో వేశారు.  రామప్ప టెంపుల్‌‌ను సందర్శించడం  అనుభూతిని ఇచ్చిందని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ ధీరత్వాన్ని  ప్రపంచ సుందరీమణులకు వివరించారు. జిల్లా కలెక్టర్‌‌ టీఎస్‌‌ దివాకర, ఎస్పీ శబరీశ్‌‌ తదితరులు పాల్గొన్నారు. 

 

 

 

రుద్రేశ్వరాలయంలో పూజలు

వరంగల్‍/హనుమకొండ: తెలుగుదనం ఉట్టిపడేలా కట్టు బొట్టుతో ప్రపంచ సుందరీమణులు ఓరుగల్లులో సందడి చేశారు. బతుకమ్మలు పట్టుకుని ఆడిపాడారు. వెయ్యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరుడికి పూజలు చేశారు. కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‍ కోటలోని కట్టడాలు, శిల్పకళా సంపదను చూసి ముగ్ధులయ్యారు. ఓరుగల్లు ఆతిథ్యానికి వావ్‍ అంటూ ఫిదా అయ్యారు. వెయ్యి స్తంభాల ఆలయ నిర్మాణం, గుడిలో నందీశ్వరుని విగ్రహం, కల్యాణ మండపం, రాతి కట్టడాల ముందు ఉత్సాహంగా ఫొటోలు దిగారు.

ఆలయ చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.  శాస్ర్తీయ నృత్యాలు, సౌండ్‍ అండ్‍ లైటింగ్‍ ద్వారా కాకతీయుల చరిత్ర, పేరిణి శివాతాండవ నృత్యాలను తిలకించారు. వెల్‍కం చెప్పిన.. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్‍ గుండు సుధారాణి, కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య, కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడేతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు, పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ తదితరులతో ఆప్యాయంగా మాట్లాడారు.

ఓరుగల్లు పర్యటన గుర్తుండేలా.. కాకతీయ తోరణం ప్రతిబింబించేలా చేనేత కలంకారీ దర్రీలు, మెమోంటోలతో సత్కరించారు. సుందరీమణులకు తెలంగాణ రుచి తెలిసేలా నాటుకోడి, యాట కూరతో డిన్నర్‍ ఏర్పాటు చేశారు. 60 నుంచి 70 రకాల వంటకాలు చేయించారు.  సాయంత్రం 5 గంటల నుంచి  రాత్రి 10 దాకా సందడి చేశారు. 
 

ఇయ్యాల=యాదగిరిగుట్ట.. పోచంపల్లిలో సందడి

యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్​ పోచంపల్లి, వెలుగు : మిస్ ​వరల్డ్​ కంటెస్టెంట్ల రాక సందర్భంగా యాదగిరిగుట్ట ముస్తాబైంది. జిల్లా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. భూదాన్​పోచంపల్లి, యాదగిరిగుట్టను విద్యుత్ దీపాలతో అలంకరించారు.   యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని గురువారం దర్శించుకుంటారు.  మరికొందరు భూదాన్ పోచంపల్లిలోని ఇక్కత్​ చీరలను పరిశీలించి, మ్యూజియం సందర్శిస్తారు. గుట్టలోని గర్భగుడిలో స్వయంభూనారసింహుడిని దర్శించుకొని పూజలు చేస్తారు.

గుట్ట చుట్టూ రోడ్ల వెంట ప్రత్యేక లైటింగ్ అమర్చారు. ఫొటోషూట్ కు తూర్పు రాజగోపురం ఎదుట వేదికను నిర్మించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయం సందర్శిస్తారు. ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పరిశీలించారు.  పోచంపల్లికి 25 మంది వెళ్లనుండగా.. సాయంత్రం రెండున్నర గంటల పాటు అక్కడ గడుపుతారు. ఇక్కడే డిన్నర్​చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్​కు వెళ్తారు. ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, కలెక్టర్​హనుమంతరావు బుధవారం పరిశీలించారు.