ఇవాళ ( మే 16 ) మూడు ప్రాంతాలకు అందగత్తెలు.. ఏఐజీ హాస్పిటల్, పిల్లలమర్రి, ఎక్స్​పీరియం ఎకో పార్క్ సందర్శన

ఇవాళ ( మే 16 ) మూడు ప్రాంతాలకు అందగత్తెలు.. ఏఐజీ హాస్పిటల్, పిల్లలమర్రి, ఎక్స్​పీరియం ఎకో పార్క్ సందర్శన

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు శుక్రవారం రాష్ట్రంలోని మూడు కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదట, మిస్ వరల్డ్ కంటెస్టంట్లు అందరూ ఉదయం 10 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌ను సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. 

ఇందులో ఏఐజీ వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.  అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్స్ వార్డు, అలాగే.. బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్‌నెస్, డైట్‌కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు.  

పిల్లలమర్రి సందర్శన

రెండో కార్యక్రమంలో భాగంగా  మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రిని సందర్శిస్తారు.  స్థానిక శివాలయం, మ్యూజియం, భారీ పిల్లలమర్రి చెట్టును పరిశీలిస్తారు. అంతేకాక.. గద్వాల పట్టు చీరలు, వాటి ప్రత్యేక నేత పద్ధతులపై కంటెస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. 

ఎక్స్​పీరియం ఎకో పార్క్ విజిట్ 

మూడో కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లు హైదరాబాద్ శివారులోని ఎక్సపీరియం ఎకో పార్క్‌ను సందర్శించ నున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్శనలో మిస్ వరల్డ్ కంటెస్టంట్లకు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను పరిచయం చేయనున్నారు. 

ఎక్స్​పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అలాగే, పార్క్‌లోని ప్రకృతి సౌందర్యం, హరిత విహార ప్రాంతాలను కంటెస్టంట్లు సందర్శించి, స్థానిక పర్యావరణ కార్యకర్తలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం  పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది.