
- సెకండ్ మిస్ కామెరూన్, థర్డ్ మిస్ ఇటలీ
- ముగిసిన మిస్ వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫినాలె
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం టాలెంట్ షో గ్రాండ్ ఫినాలె జరిగింది. ఇందులో మిస్ ఇండోనేషియా (పియానో) విజేతగా నిలిచింది. రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్), మూడో స్థానంలో మిస్ ఇటలీ (బ్యాలె డ్యాన్స్) నిలిచారు. మిస్ ఇండోనేసియా పియానో వాయించి సత్తా చాటగా.. మిస్ కామెరూన్ తన సింగింగ్ ప్రతిభతో, మిస్ ఇటలీ బ్యాలె డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఫినాలెలో తెలంగాణ ఫోక్ సాంగ్ ‘రాను బొంబైకి రాను’ పాటకు మిస్ నైజీరియా డ్యాన్స్ చేసింది.
ఫ్లోర్ డ్యాన్స్ చేసి ఎస్టోనియా కంటెస్టెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఐ లవ్ స్టోరీస్’ అనే అద్భుత గీతం పాడి బ్రెజిల్ అందాల భామలు మైమరించారు. ఐస్ స్కేటింగ్‌తో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. అర్బన్ డాన్స్ మూవ్‌మెంట్స్‌తో అర్జెంటీనా కంటెస్టెంట్ ఆకట్టుకున్నారు. సంప్రదాయ సింహళి నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్‌ను ప్రదర్శించారు. ట్రినిటాడ్ కంటెస్టెంట్ ఏరోబిక్స్ ప్రదర్శనతో మెప్పించారు. గుండెపోటు బాధితులను సీపీఆర్ చేసి ఎలా కాపాడాలో వివరించి వేల్స్ కంటెస్టెంట్ శభాష్ అనిపించుకున్నారు. కెన్యా కంటెస్టెంట్ జుంబా, డీజే ద్వారా ఉర్రూతలూగించింది. భారత్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ సినిమా రామ్‌లీలాలోని దోల్ భాజే సాంగ్ పాడడంతో పాటు డ్యాన్స్ చేసి ఆహూతులను కట్టిపడేశారు.